Election Awareness: తెలుగు నేల అంటేనే పోరాటాల పురిటిగడ్డ. అన్యాయాన్ని ఎదిరించి, ఆత్మగౌరవం కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన వీరుల చరిత్ర ఈ మట్టి సొంతం. “చిదిమేకొద్దీ ఎదిగెనంట.. కోసేకొద్దీ పూసెనంట” అన్నట్లుగా ఎంతగా అణచివేయాలని చూస్తే అంతగా ఎగిసిపడే పోరాట పటిమ ఈ గడ్డ రక్తంలోనే ఉంది. చావుకు భయపడకుండా హక్కుల కోసం గర్జించిన త్యాగాల బిడ్డల వీరత్వం నేటికీ ప్రతి తెలుగు బిడ్డ గుండెల్లో అగ్నిజ్వాలలను రగిలిస్తూనే ఉంది.
ప్రలోభాల వలలో చిక్కొద్దు.. విప్లవ యోధుల్లా కదలాలి!
నాడు భూమి కోసం, ఆత్మగౌరవం కోసం ప్రాణాలొడ్డిన త్యాగధనుల వారసులమైన మనం నేడు ఎటువైపు అడుగులు వేస్తున్నామన్నది యువతరం ఆత్మపరిశీలన చేసుకోవాలి. దురదృష్టవశాత్తూ ప్రస్తుత ఎన్నికల వాతావరణంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి మసకబారుతోంది. ఎన్నికలంటే కేవలం ఓటుకు నోటు, చుక్క, బిర్యానీ పొట్లాలకు అమ్ముడుపోయే వ్యాపారంగా మారిపోవడం అత్యంత బాధాకరం. త్యాగాలతో సాధించుకున్న భారత గడ్డపై నేటి యువతీ యువకులు తాత్కాలిక ప్రలోభాలకు లొంగిపోకూడదు. ఆ నాటి వీరుల పోరాట స్ఫూర్తిని గుండెల్లో నింపుకుని, అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకలుగా మారాలి.
భవిష్యత్ నిర్మాణానికి సారథులు, వారధులు కావాలి
సమాజంలో నిజమైన మార్పు తీసుకురాగల శక్తి యువత చేతుల్లోనే ఉంది. నాటి పోరాటాలకు సారథులు, వారధులుగా నిలిచిన త్యాగధనుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత నేటి తరం మీదే ఉంది. ఓటు అనే వజ్రాయుధాన్ని విచక్షణతో ఉపయోగిస్తూ, అవినీతి, ప్రలోభాలను తరిమికొట్టాలి. స్వార్థ రాజకీయాలకు చెక్ పెడుతూ భవిష్యత్ భారతం నిర్మాణానికి నేటి యువతీ యువకులు నిజమైన సారథులుగా, వారధులుగా నిలవాలని ఈ నేల పిలుపునిస్తోంది.
