తక్కువ ఛార్జీల ఆశ చూపి కబ్జా.. పేద డ్రైవర్ల పొట్ట కొడుతున్న కార్పొరేట్ దోపిడీపై కేకేసీ నిప్పులు!

Green SM

Green SM

Green SM: హైదరాబాద్ మహానగరంలో క్యాబ్, ఆటో రంగాలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న లక్షలాది మంది పేద డ్రైవర్ల బతుకులు నేడు ప్రశ్నార్థకంగా మారాయి. వియత్నాంకు చెందిన ‘గ్రీన్ ఎస్ఎం’ (Green SM) ఎలక్ట్రిక్ క్యాబ్ సంస్థ అడుగుపెట్టినప్పటి నుంచి స్థానిక డ్రైవర్ల ఉపాధిపై తీవ్ర దెబ్బ పడింది. అప్పులు చేసి సొంతంగా కార్లు కొనుగోలు చేసుకున్న డ్రైవర్లు, కనీసం నెలవారీ ఈఎంఐలు (EMIs) కూడా కట్టలేక రోజుకు రూ. 500 నుంచి రూ. 800 వరకు ఆదాయాన్ని కోల్పోతూ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో పేద క్యాబ్ డ్రైవర్ల పొట్ట కొట్టే కార్పొరేట్ ఆగడాలను తక్షణమే అడ్డుకోవాలని కార్మిక, కర్షక కాంగ్రెస్(కేకేసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఆశ చూపి మోసం చేస్తున్న గ్రీన్ ఎస్ఎం సంస్థ

గ్రీన్ ఎస్ఎం కంపెనీ అనుసరిస్తున్న వ్యాపార ఎత్తుగడలపై టి. రాజశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “కిలోమీటర్‌కు రూ. 8 నుంచి రూ. 9 మాత్రమే ఛార్జీ అంటూ ప్రచారం చేసి, డ్రైవర్లకు నెలకు రూ. 35 వేల నుంచి రూ. 40 వేల వరకు స్థిర ఆదాయం వస్తుందని ఆశ చూపి మార్కెట్లోకి ప్రవేశించింది. తీరా కస్టమర్లను, డ్రైవర్లను ఆకర్షించాక తన అసలు రంగు బయటపెట్టింది. ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలు వసూలు చేస్తూ, ‘పార్ట్‌నర్‌షిప్’ మోడల్ పేరుతో పన్నులు ఎగ్గొడుతూ స్థానిక ఉబర్, ఓలా, ఆటో డ్రైవర్ల పొట్ట కొడుతోంది. జేబీఎస్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఆధిపత్యం చెలాయిస్తూ వేలాది మంది పేద డ్రైవర్లను రోడ్డున పడేయడం దారుణం” అని ఆయన మండిపడ్డారు.

తప్పుదోవ పట్టించే వారిపట్ల అప్రమత్తత అవసరం

ఇదే సమయంలో, డ్రైవర్ల ఆవేదనను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటూ కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలపైనా రాజశేఖర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. “అసలు మోసం చేస్తున్నది, నిబంధనలు ఉల్లంఘిస్తున్నది గ్రీన్ ఎస్ఎం అనే ప్రైవేట్ కంపెనీ అయితే.. కొందరు వ్యక్తులు ఆ కంపెనీ తప్పులను కప్పిపుచ్చుతూ, సమస్యను పక్కదారి పట్టించి డ్రైవర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. కార్మికుల ఐక్యతను దెబ్బతీసి, వారి కష్టాలను రాజకీయం చేయాలని చూసే అటువంటి శక్తుల పట్ల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి. అసలైన పోరాటం కార్పొరేట్ దోపిడీపైనే జరగాలి” అని ఆయన చురకలు అంటించారు.

ప్రభుత్వానికి విజ్ఞప్తి – నిష్పక్షపాత చర్యలు చేపట్టాలి!

హైదరాబాద్‌లో నష్టపోతున్న క్యాబ్, ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని టి. రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పూర్తి నిష్పక్షపాతంగా వ్యవహరించి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న గ్రీన్ ఎస్ఎం కార్యకలాపాలపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పేద డ్రైవర్ల ఉపాధికి రక్షణ కల్పిస్తూ, సరైన ఛార్జీల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణే తమ ధ్యేయమని, డ్రైవర్ల న్యాయమైన పోరాటానికి కేకేసీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.