Overloaded Tipper: నిత్యం రద్దీగా ఉండే ఆటోనగర్ నుంచి ఫిల్మ్ సిటీ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఓ భారీ టిప్పర్ యమపాశంలా దూసుకెళ్తోంది. ఎటువంటి రక్షణ కవచం లేకుండా, భారీ బండరాళ్లతో (TS 15UF 5827) ప్రయాణిస్తూ తోటి వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.
వాహనం కుదుపులకు లోనై ఒక్క బండరాయి జారి కిందపడినా, వెనుకే వెళ్తున్న ఆటోలు, ద్విచక్ర వాహనదారుల పరిస్థితి ఏమిటో ఊహించుకుంటేనే భయమేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ ప్రమాదకర రవాణా.. మినిట్ 2 మినిట్ కెమేరా కంటికి చిక్కింది. ఘోర ప్రమాదం జరగకముందే రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు కళ్లు తెరిచి ఇలాంటి వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాహనదారులు అంటున్నారు.
