ఒకనాటి ఆఫ్రో-ఏషియన్ గేమ్స్ వేదిక నేడు కళావిహీనం
పైకప్పు నుంచి కారే వర్షపు నీళ్లు.. పగుళ్లు తేలిన గోడలు
టెన్నిస్ కోర్టులో నీళ్లు తోడడానికి కోచ్‌ల తంటాలు
ఏది నాటి వైభవం అంటూ క్రీడాకారుల నిట్టూర్పులు
జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని క్రీడాభిమానుల ఆగ్రహం
మినిట్ 2 మినిట్, రంగారెడ్డి(ఆగస్ట్ 11): సరైన మైదానం లేని చోట క్రీడాకారుడి కల పురిటిలోనే సమాధి అవుతుంది. ఆటకు చక్కని మైదానం, శిక్షణకు సరైన వేదిక తోడైనప్పుడే మైదానంలో చెమట చిందించే క్రీడాకారులు రికార్డులను తిరగరాస్తారు. దేశానికి పతకాల పంట పండిస్తారు. కానీ, అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన ఒక ప్రతిష్ఠాత్మక స్టేడియం పాలకుల నిర్లక్ష్యానికి బలై, పగుళ్లు తేలిన గోడలతో ‘నన్ను కాపాడండి’ అని మూలుగుతుంటే.. ఇక తెలంగాణ నుంచి కొత్త ఛాంపియన్లు ఎలా పుట్టుకొస్తారు? వేలాది మంది క్రీడాకారులను తీర్చిదిద్దిన సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం నేడు పాలకుల, అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఒకనాడు ఆఫ్రో-ఏషియన్ గేమ్స్ వంటి అంతర్జాతీయ పోటీలకు వేదికగా నిలిచిన సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం నిర్వహణా వైఫల్యాలపై మినిట్ 2 మినిట్ ప్రత్యేక కథనం.
అడుగడుగునా నిర్లక్ష్యం
ప్రతిరోజూ ఇక్కడికి ఎంతో మంది చిన్నారులు, యువకులు వ్యాయామం, శిక్షణ కోసం వస్తుంటారు. అయితే స్టేడియంలో నిర్వహణ లోపాలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. ప్రాంగణంలో కుక్కల బెడద ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. మరోవైపు తెరిచి ఉన్న మ్యాన్‌హోళ్లు ప్రాణాలకు ముప్పుగా మారాయి. ఇక వాన కురిసిందంటే చాలు.. టెన్నిస్ కోర్టులో శిక్షణ ఇవ్వాల్సిన కోచ్‌లే నీళ్లను బయటకు తోడుకోవడానికి ఆపసోపాలు పడాల్సిన స్థితి నెలకొంది. ప్రహారి గోడ కూలిపోవడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది.
ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో విజన్‌తో నిర్మించిన ఈ స్టేడియంలో నేడు పరిస్థితి ఘోరంగా ఉంది. వర్షం వస్తే కప్పు పైనుంచి నీళ్లు కారుతుండగా, గోడలు పగుళ్లు తేలి పెచ్చులు ఊడుతున్నాయి. ఎంతో మంది పేద, మధ్యతరగతి యువతకు క్రీడా శిక్షణనివ్వాల్సిన ఈ ప్రాంగణాన్ని అధికారులు, పాలకులు కేవలం రాజకీయ, మతపరమైన, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలకు వేదికగా వాడుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “తెలంగాణ క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాలి.. యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్స్ నెలకొల్పుతాం” అని గొప్పలు చెప్పే పాలకులకు, చేతిలో ఉన్న ఇటువంటి ప్రపంచ స్థాయి స్టేడియాన్ని బాగుచేసే నైతికత ఉందా? అని క్రీడాభిమానులు ప్రశ్నిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిన నిర్లక్ష్యం ఒకెత్తయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వైఖరి ప్రదర్శిస్తుండటం గమనార్హం.
