– వైకాపా నేతల తీరుపై ఏపీ డిప్యూటీ సీఎం ఆగ్రహం
– పవిత్ర దైవ నామాల పారడీపై చట్టపరమైన చర్యలు
– ధార్మిక విశ్వాసాలను కించపరిస్తే సహించేది లేదని స్పష్టీకరణ
మినిట్ 2 మినిట్, అమరావతి (ఆగస్ట్ 11): తిరుమల శ్రీవారిని భక్తిశ్రద్ధలతో కొలిచే పవిత్ర దైవ నామాలు, భక్తి గీతాలను వైకాపా నేతలు రాజకీయ నిరసనల్లో పేరడీగా పడటాన్ని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. నెల్లూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వైకాపా నాయకులు ప్రవర్తించిన తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ తమ అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ వ్యవహారంపై చట్టప్రకారంగా ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ, రాజకీయ స్వార్థం కోసం పవిత్రమైన గోవింద నామాలను పేరడీ చేస్తూ కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని విమర్శించారు. సదరు కార్యక్రమంలో పాల్గొన్న నేతల వైఖరి ప్రజల ధార్మిక విశ్వాసాలకు విఘాతం కలిగించేలా ఉందన్నారు.
సమాజంలో మత విద్వేషాలు రేపే కుట్రపూరిత ఆలోచనలతోనే వైకాపా ఈ చర్యలకు పాల్పడిందని దుయ్యబట్టారు. ఇటువంటి మతవిద్వేష పూరిత చర్యలపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక విశ్వాసాల్లో అత్యంత భాగమైన దైవ నామాలు, కీర్తనలను పరిహాసం కోసం వాడే నిచమైన సంస్కృతిని అందరూ స్వస్తి పలకాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా హితవు పలికారు.
