– దొంగల భయంతో పొలంలో పాతిపెట్టిన రాజస్థాన్ రైతు
– ఏడాది తర్వాత చూస్తే చినిగిన స్థితిలో నోట్ల కట్టలు
మినిట్ 2 మినిట్, ఇంటర్నెట్ డెస్క్(ఆగస్ట్ 11): కష్టపడి సంపాదించిన సొమ్మును దొంగల బారిన పడకుండా కాపాడుకోవడానికి ఏం చేయాలి? బ్యాంకులో డిపాజిట్ చేయాలి లేదా సేఫ్‌లో దాచుకోవాలి. కానీ, రాజస్థాన్‌కు చెందిన మాంగీలాల్ అనే రైతుకు అంతకు మించిన ఐడియా వచ్చింది. బ్యాంకు కంటే తన ‘సొంత పొలమే’ సురక్షితమైనదని భావించి.. ఏకంగా రూ. 5 లక్షల నోట్ల కట్టలను ఒక కవరులో చుట్టి పొలంలో గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టాడు! ప్లాట్ అమ్మగా వచ్చిన ఐదు లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్తారు లేదా ఇంట్లో వాళ్లు ఖర్చు చేస్తారోనన్న ‘అతి జాగ్రత్త’తో రాత్రికి రాత్రే దాచేశాడు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది! దాచిన కొద్దిరోజులకే పాతిపెట్టిన స్థలాన్ని మనోడు మర్చిపోయాడు. 10 బిగాల పొలంలో ఎక్కడ తవ్వినా ఆ నిధి దొరకలేదు. దీంతో ‘నా వల్ల కాదని’ ఊరు వదిలేసి కూలీ పనికి వెళ్లిపోయాడు.
ఏడాది తర్వాత పొలం దున్నుతుంటే ఆ కవరు బయటపడింది. ఎంతో సంబరంగా వెళ్లి ఓపెన్ చేసి చూస్తే.. ఆయన ‘అతి తెలివి’కి చెదలు గ్రాండ్ ట్రీట్ ఇచ్చుకున్నాయి! రూ.500 నోట్లన్నీ పొడిపొడిగా మారి కనిపించాయి. తీరా ఆ ముక్కలు పట్టుకుని బ్యాంకుకు వెళ్తే.. “ఇదేం కచోరీ కాదు మార్చడానికి” అని అధికారులు చేతులెత్తేశారు. “బ్యాంకులను నమ్మక పొలంలో దాస్తే.. భూమి తల్లి కాకుండా చెదపురుగులు దాచుకున్నాయి” అంటూ ఊరి జనాలు ఇప్పుడు నవ్వుకుంటున్నారు!
