నేటి నుంచే కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే
ఫ్లైఓవర్ ప్రాజెక్టు పనుల దృష్ట్యా రెండేళ్ల పాటు కొనసాగనున్న ఆంక్షలు
సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ.. రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు
మినిట్ 2 మినిట్, హైదరాబాద్(ఆగస్ట్ 18): హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు గాను వన్‌వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది. ఉదయం 6 గంటల నుంచే ఈ కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. ప్రాజెక్టు పనుల నేపథ్యంలో దాదాపు రెండేళ్ల పాటు ఈ వన్‌వే విధానం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
వాహనాల రాకపోకలను పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు, డ్రోన్లు, హైరైజ్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. పార్కుకు వచ్చే వాకర్లు, సందర్శకుల కోసం ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ట్రాఫిక్ అధికారులు సూచించిన స్థలాల్లోనే వాహనాలను పార్క్ చేయాల్సి ఉంటుంది.
కొత్త నిబంధనలకు అనుగుణంగా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని చుట్టుపక్కల ఉండే ఆస్పత్రులు, ఐటీ కంపెనీల యాజమాన్యాలతో అధికారులు ముందస్తుగా చర్చించారు. వన్‌వే నిబంధనలు ఉల్లంఘించి రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
