LB NAGAR: సిరీస్ రోడ్డు … ఆ వ్యాపారానికి అడ్డా!

పక్కనే ఓయో హోటల్స్.. బేరం కుదరగానే లోపలికి
ఆ రోడ్డులో వెళ్లాలంటే భయపడుతున్న ఒంటరి మహిళలు
పోకిరీగాళ్ల, విటుల మాటలతో బెంబేలెత్తున్న వైనం
పోలీసులు ఏం చేస్తున్నారంటూ స్థానికులు మండిపాటు

మినిట్ 2 మినిట్, ఎల్బీ నగర్(ఆగస్ట్ 23): ఎల్బీ నగర్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు హద్దులు దాటుతున్నాయి. నాగోల్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బ్రాంచ్ నుంచి మొదలుకొని సిరీస్ రోడ్డు వరకు ఉన్న ప్రధాన రహదారి ఇప్పుడు బహిరంగ వ్యభిచార దందాకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రతిరోజూ వికృత ఘట్టాలు వెలుగుచూస్తున్నాయి. రోడ్డుపైనే బహిరంగంగా బేరసారాలు సాగిస్తూ, పక్కనే ఉన్న ఓయో (OYO) హోటళ్లను అడ్డాగా చేసుకుని ఈ అక్రమ వ్యాపారాన్ని నిర్భయంగా నడిపిస్తున్నారు.

ఈ పరిణామాలు స్థానిక ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆ రోడ్డులో కాలినడకన లేదా ఒంటరిగా వెళ్లే మహిళలు, విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని పోకిరీగాళ్లు, విటులు అసభ్యకరంగా మాట్లాడుతూ వేధింపులకు గురిచేస్తున్నారు. సామాన్య మహిళలను కూడా విటులు తప్పుగా భావించి వ్యాఖ్యలు చేస్తుండటంతో భయాందోళనతో ఆ దారిలో వెళ్లడానికే జంకుతున్నారు. చీకటి పడితే చాలు అక్కడ వాతావరణం భయంకరంగా మారుతోందని, పోకిరీగాళ్ల మాటలకు, అసభ్య చేష్టలకు బెంబేలెత్తిపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజావాసాలు, ప్రధాన వ్యాపార సముదాయాలు ఉన్న ప్రాంతంలోనే నడిరోడ్డుపై ఇలాంటి దందా సాగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతున్నా, వీటికి చెక్ పెట్టకపోవడం వెనుక మర్మమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు, స్థానిక పోలీసులు తక్షణమే స్పందించి సిరీస్ రోడ్డులో అక్రమంగా సాగుతున్న ఈ ఓయో సెటిల్మెంట్లు, రోడ్డుపై సాగే వ్యభిచార అడ్డాలపై పోలీసులు తనిఖీలు నిర్వహించి, కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.