ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర.. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ కైవసం!
ప్రతిష్టాత్మక ‘గ్రాండ్ చెస్ టూర్’ టైటిల్ నెగ్గిన తొలి భారతీయుడు
ఫైనల్లో అమెరికన్ క్రీడాకారుడు ఫాబియానో కరువానాపై సంచలన విజయం
సుమారు రూ.2 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం.. వచ్చే ఏడాది టూర్‌కు నేరుగా అర్హత
మినిట్ 2 మినిట్, న్యూఢిల్లీ (ఆగస్ట్ 29): భారత యువ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద అంతర్జాతీయ చదరంగ వేదికపై మరో సంచలనం నమోదేశారు. ప్రతిష్టాత్మకమైన ‘గ్రాండ్ చెస్ టూర్’ టైటిల్‌ను కైవసం చేసుకుని, ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారుడిగా సరికొత్త చరిత్ర సృష్టించారు. తుదిపోరులో డిఫెండింగ్ ఛాంపియన్, అమెరికా దిగ్గజ క్రీడాకారుడు ఫాబియానో కరువానాపై 15-13 పాయింట్ల తేడాతో ప్రజ్ఞానంద అద్భుత విజయం సాధించారు. ఆఖరి రోజు ఆట ప్రారంభ సమయానికి ప్రత్యర్థి కంటే 6 పాయింట్ల భారీ వెనుకంజలో ఉన్నప్పటికీ ప్రజ్ఞానంద ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఆరంభంలో తీవ్ర ఒత్తిడి ఎదురైనా, ఏమాత్రం తడబడకుండా ఆడి వరుసగా రెండు ర్యాపిడ్ గేమ్‌లలో గెలిచి మ్యాచ్‌ను పూర్తిగా తన ఆధిక్యంలోకి మలుచుకున్నారు.
బ్లిట్జ్ విభాగంలోనూ తన పైచేయిని నిలబెట్టుకున్న ప్రజ్ఞానంద.. తుదిపోరులో తిరుగులేని విజయాన్ని అందుకుని ఛాంపియన్‌గా అవతరించారు. ఈ చారిత్రక విజయంతో ప్రజ్ఞానంద సుమారు రూ.2 కోట్ల ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ అద్భుత ప్రదర్శన ఆధారంగా వచ్చే ఏడాది జరగబోయే గ్రాండ్ చెస్ టూర్‌కు నేరుగా అర్హత సాధించారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల నుంచి పుంజుకుని ప్రజ్ఞానంద సాధించిన ఈ అసాధారణ విజయం పట్ల యావత్ భారత క్రీడా ప్రపంచం, ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశం గర్వించేలా చేసిన ఈ యువ సంచలనానికి సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
