pitapuram: పిఠాపురం ఆడపడుచులకు పవన్ కానుక!

పిఠాపురం ఆడపడుచులకు పవన్ కానుక!

రాఖీ పౌర్ణమి సందర్భంగా వితంతువులు, ఒంటరి మహిళలకు చీరల పంపిణీ

పవన్ కళ్యాణ్ ఫోటోలకు రాఖీలు కట్టి సంతోషం వ్యక్తం చేసిన మహిళలు

మినిట్ 2 మినిట్, పిఠాపురం (ఆగస్ట్ 29): దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ శుభసమయంలో పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ ఆడపడుచులకు అరుదైన కానుక పంపించారు. 45 ఏళ్ల లోపు వయసున్న 2439 మంది వితంతువులు, ఒంటరి మహిళలకు రాఖీ కానుకగా చీరలు అందజేశారు.

స్థానిక మున్సిపల్, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రజా ప్రతినిధులు, జనసేన నాయకులు ఈ కానుకలను మహిళలకు స్వయంగా పంపిణీ చేశారు. పిఠాపురం టౌన్, స్టువర్టుపేట, విరవాడ ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానుకలు అందుకున్న మహిళలు పవన్ కళ్యాణ్ ఫోటోల వద్ద రాఖీలు ఉంచి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులు సహా పలు అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని మహిళలు తెలిపారు. జీవితంలో ఎప్పుడూ ఎవరికీ రాఖీ కట్టని కొందరు మహిళలు, మొదటిసారి పవన్ కళ్యాణ్ రూపంలో రాఖీ కానుక అందుకోవడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ప్రజాసేవలో ఉన్నంతకాలం తమకు ఎలాంటి కష్టం రాదని ధీమా వ్యక్తం చేశారు.