TELANGANA: సీఎం రేవంత్‌కు బంగారు రాఖీ రాజీ బాటలో మంత్రి కొండా సురేఖ?

సీఎం రేవంత్‌కు బంగారు రాఖీ
రాజీ బాటలో మంత్రి కొండా సురేఖ?
సీఎం జూబ్లీహిల్స్ నివాసంలో ఆసక్తికర పరిణామం
సీఎం అల్లుడు, మనవడికి కూడా రాఖీలు కట్టిన కొండా సురేఖ, సీతక్క
వివాదాల వేళ సురేఖ ‘రాఖీ రాజకీయం’పై ఆసక్తికర చర్చ

మినిట్ 2 మినిట్, హైదరాబాద్(ఆగస్ట్ 29): తెలంగాణ రాజకీయంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల పరకాల వివాదం, ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి నివేదిక ఇచ్చిన వరుస పరిణామాల నేపథ్యంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టడం కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి చేరుకున్న మంత్రి కొండా సురేఖ, మరో మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి నుదుట తిలకం దిద్ది, ఆయన చేతికి రాఖీ కట్టారు. అనంతరం సీఎం, ఇద్దరు మంత్రులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని పండుగ సంతోషాన్ని పంచుకున్నారు.

వివాదాల వేళ ప్రత్యేక ఆకర్షణ

గత కొన్ని రోజులుగా కొండా సురేఖ బర్తరఫ్ కానున్నారనే ఊహాగానాలు, అంతర్గత రాజకీయ వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో సీతక్కతో కలసి కొండా సురేఖ స్వయంగా సీఎం వద్దకు వచ్చి రాఖీ కట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు మంత్రులకు ఆశీస్సులు అందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో మంత్రులతో పాటు తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి, కమిషన్ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, బ్రహ్మకుమారీలు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, మలక్‌పేట్‌లోని గవర్నమెంట్ హైస్కూల్ ఫర్ ది బ్లైండ్ గర్ల్స్ విద్యార్థినులు పాల్గొని సీఎంకు రాఖీలు కట్టారు. దీంతో సీఎం నివాసంలో పండుగ సందడి నెలకొంది.

ప్రత్యేకంగా చేయించిన ‘గోల్డ్ రాఖీ’

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం తాను ప్రత్యేకంగా చేయించిన ‘గోల్డ్ రాఖీ’ కట్టినట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ప్రతి ఏడాది రేవంత్‌రెడ్డికి రాఖీ కడుతుంటానని, ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది కూడా ఖచ్చితంగా కడతానని ఆమె పేర్కొన్నారు. ఈసారి ప్రత్యేక శ్రద్ధతో సీఎం కోసం బంగారం రాఖీ చేయించి తెచ్చినట్లు తెలిపారు. మంత్రి సీతక్కతో కలిసి సీఎం నివాసానికి వెళ్లి రాఖీ కట్టానని, అలాగే ముఖ్యమంత్రితో పాటు ఆయన అల్లుడికి, మనవడికి కూడా రాఖీలు కట్టినట్లు కొండా సురేఖ స్పష్టం చేశారు. ఈ పరిణామంతో గత కొన్ని రోజులుగా సాగుతున్న రాజకీయ వివాదాలకు స్వస్తి పడినట్లేనా అనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది.