నాగోల్‌లో ఉద్రిక్తత.. ఎస్సీ కమర్షియల్ కాంప్లెక్స్ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నం.. అట్రాసిటీ కేసు నమోదుకు డిమాండ్!

SC Land

SC Land

SC Land:  ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని నాగోల్ డివిజన్ జైపూర్ కాలనీలో షెడ్యూల్ కులాలకు కేటాయించిన స్థలాన్ని.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజారెడ్డి అక్రమంగా ఆక్రమించేందుకు యత్నించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జైపూర్ కాలనీ రోడ్డు నంబరు 1లో ఎస్సీ షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం కేటాయించిన కమర్షియల్ కాంప్లెక్స్ స్థలాన్ని ఆక్రమించే కుట్రలో భాగంగా బీఆర్‌ఎస్ నేత అనంతుల రాజారెడ్డి, ఆయన అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారని తెలంగాణ అంబేడ్కర్ సంఘం నాయకులు ఆరోపించారు. ఎస్సీ కులాల ఆత్మగౌరవం, మనోభావాలను దెబ్బతీసేలా రాజారెడ్డి వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ స్థలంలో గతంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన నేమ్‌బోర్డుతో పాటు చుట్టూ వేసిన ఇనుప ఫెన్సింగ్‌ను రాజారెడ్డి, ఆయన అనుచరులు బలవంతంగా కూల్చివేసినట్లు బాధితులు తెలిపారు. శిథిలావస్థలో ఉన్న కాంప్లెక్స్ పునర్నిర్మాణ పనులకు అధికారులు వచ్చిన సమయంలో, అధికారులను కూడా బెదిరిస్తూ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని హెచ్చరించారని వాపోయారు.

షెడ్యూల్ కులాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన రాజారెడ్డితో పాటు పైడిమర్రి శంకర్, జొన్నాడ మాధవి, శ్యామలా యాదగిరి, నందికంటి అజయ్, నందికంటి లక్ష్మీ, జంగాల కుమార్ తదితరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నాగోల్ పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సీఐ జానీకి వినతి పత్రాన్ని అందజేశారు.

షెడ్యూల్ కులాలకు కేటాయించిన భూములను రాజకీయ బలం, ఆధిపత్య భావజాలంతో కబ్జా చేయాలని చూడటం దారుణమని అంబేద్కర్ వాదులు, దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం నేతలు డిమాండ్ చేశారు.