స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేలా కేంద్రం కీలక నిర్ణయం.. నవంబర్ 1 నుంచి ‘CNAP’ విధానం

CNAP Service

CNAP Service

CNAP Service: భారతదేశంలో మొబైల్ వినియోగదారుల భద్రతను మెరుగుపరిచేందుకు మరియు మోసపూరిత/సైబర్ నేరాల కాల్స్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026 నవంబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ‘కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్’ (CNAP) విధానాన్ని తప్పనిసరి చేయాలని టెలికమ్యూనికేషన్ల శాఖ టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది.

ఈ నూతన వ్యవస్థ అమలులోకి వస్తే, వినియోగదారులకు ఫోన్ నంబర్ కాంటాక్ట్స్‌లో సేవ్ లేకపోయినప్పటికీ, టెలికాం ఆపరేటర్ల (KYC) డేటాబేస్ ఆధారంగా కాల్ చేస్తున్న వ్యక్తి అసలు పేరు మొబైల్ స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది.

4G, 5G నెట్‌వర్క్‌లలో తొలి విడత – వ్యక్తిగత డేటా భద్రతకు ప్రత్యేక నిబంధనలు:
తొలి విడతగా ఈ సేవను 4G, 5G నెట్‌వర్క్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫోన్‌లో నంబర్ సేవ్ చేసి ఉంటే వినియోగదారుడు సేవ్ చేసుకున్న పేరే కనిపిస్తుందని, నంబర్ సేవ్ లేని పక్షంలో టెలికాం రికార్డుల్లోని పేరు ప్రదర్శితమవుతుందని అధికారులు వెల్లడించారు. విదేశీ కాల్స్‌కు ప్రత్యేక ముద్ర పడుతుంది.

వ్యాపార సంస్థలు తమ ట్రేడ్‌మార్క్ ఆధారంగా వ్యాపార నామాలను ప్రదర్శించే వెసులుబాటును కల్పించారు. అలాగే సమాచార భద్రత కోసం కాల్ పూర్తయిన తర్వాత ఆ డేటాను నిల్వ చేయరాదని, CLIR వెసులుబాటు ఉన్న వినియోగదారుల వివరాలు వెల్లడి కావని కేంద్రం స్పష్టం చేసింది. 2024 ఫిబ్రవరిలో ట్రాయ్ (TRAI) చేసిన సిఫార్సుల మేరకు ఈ విప్లవాత్మక మార్పు అమల్లోకి వస్తోంది.