Police Commemoration: విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలోని ‘స్మృతి వనం’లో అక్టోబర్ 21న పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎం. బబిత, జిల్లా కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి, మరియు జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ముఖ్య అతిథులుగా హాజరై విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల స్మృతి స్థూపం వద్ద పూలమాలలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన 154 మంది పోలీసుల వివరాలతో కూడిన పుస్తకాన్ని ఎస్పీ ఆవిష్కరించగా, అమరులైన అధికారుల పేర్లను ఏఆర్ అదనపు ఎస్పీ పి. కిరణ్ కుమార్ చదివి వినిపించారు.
అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం – ఎస్పీ, కలెక్టర్, జడ్జి భరోసా:
జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మాట్లాడుతూ.. దేశంలో మావోయిజం, తీవ్రవాదం తీవ్రంగా ఉన్న సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం వీరోచిత పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాల వల్లనే నేడు ప్రజలందరూ ప్రశాంతంగా, స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని కొనియాడారు. జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబితలు మాట్లాడుతూ అమరుల కుటుంబాలకు అన్ని విభాగాలు, న్యాయ వ్యవస్థ సంపూర్ణ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. అనంతరం రిజర్వు ఇన్ స్పెక్టర్ ఎన్. గోపాల నాయుడు ఆధ్వర్యంలో పరేడ్ నిర్వహించి నివాళులర్పించారు.
కార్యక్రమం అనంతరం అమరులైన సిహెచ్. చిరంజీవరావు, షేక్ ఇస్మాయిల్ కుటుంబ సభ్యులతో అధికారులు మమేకమై పండ్లు, నగదు అందజేసి, కలెక్టరేట్ జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీ మరియు మానవహారంలో పాల్గొన్నారు.
