హైదరాబాద్: ‘స్పిరిట్ ఇస్ నాట్ వన్’ సినిమాపై ఇటీవల కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలను చిత్ర యూనిట్ తీవ్రంగా ఖండించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, వాస్తవాలకు విరుద్ధంగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని నిర్మాత నర్సమ్మ, చిత్ర బృందం స్పష్టం చేసింది. సినిమా నిర్మాణం, టైటిల్ మార్పు, బ్యానర్ మార్పు వంటి అంశాలన్నీ చట్టబద్ధంగా, సంబంధిత నిబంధనల ప్రకారమే జరిగాయని, ఈ ప్రాజెక్టులో తన పాత్ర గురించి కృష్ణారెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ తేల్చి చెప్పింది. వ్యక్తిగత కారణాలు, ఆర్థిక లావాదేవీలు లేదా కుటుంబ విషయాలను సినిమాతో ముడిపెట్టి చిత్ర యూనిట్‌పై నిరాధార ఆరోపణలు చేయడం ఎంతైనా బాధాకరమని నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం వెనుక ఉన్న ఉద్దేశాలు ఏమిటో అర్థం కావడం లేదని చిత్ర బృందం అభిప్రాయపడింది. తాము చట్టప్రకారమే ముందుకు వెళ్లామని, అవసరమైతే అన్ని ఆధారాలను సంబంధిత అధికారుల ముందు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. తప్పుడు ఆరోపణల వల్ల చిత్ర యూనిట్ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలను ఎంతమాత్రం సహించబోమని ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రేక్షకులు, మీడియా ప్రతినిధులు ఇలాంటి ఏకపక్ష ఆరోపణలను నమ్మకుండా, పూర్తి వాస్తవాలను పరిశీలించి నిజా నిజాలను గ్రహించాలని ‘స్పిరిట్ ఇస్ నాట్ వన్’ చిత్ర యూనిట్ అధికారిక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.
Spirit Is Not One: కృష్ణారెడ్డి ఆరోపణలు అవాస్తవం: ‘స్పిరిట్ ఇస్ నాట్ వన్’ నిర్మాత నర్సమ్మ
