ఎస్‌బీఐ హ్యాకింగ్ కలకలం మరవకముందే.. హెచ్‌డీఎఫ్‌సీలో సంచలన డేటా లీకేజీ!

HDFC Bank

HDFC Bank

HDFC Bank: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ కస్టమర్ల బ్యాంక్ ఖాతాలు హ్యాక్ అయ్యాయని వెల్లడించిన విషయం సంచలనంగా మారిన వేళ, దేశంలోనే మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీలో కీలక సమాచారం లీక్ అయిన అంశం తీవ్ర దుమారం రేపుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు సంస్థకు సంబంధించిన రహస్య వ్యాపార వ్యూహాలు, మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉన్న అత్యంత సున్నితమైన సమాచారాన్ని బయటి వ్యక్తులకు వెల్లడించినట్లు దర్యాప్తులో ఆధారాలు లభించాయని తాజాగా బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదించింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లోని కొంతమంది కీలక నాయకులకు ఈ సమాచారం లీక్ అవుతోందనే అనుమానం రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్‌లోని కొన్ని కీలక వ్యాపార విభాగాలు, విధులను పర్యవేక్షిస్తున్న ఈ ఇద్దరు సీనియర్ అధికారులపై అనుమానాలు రావడం వల్ల యాజమాన్యం అంతర్గత విచారణ ప్రారంభించింది. విచారణ చేపట్టగా ఆ ఇద్దరు అధికారులు ఈ సమాచార ఉల్లంఘనకు పాల్పడినట్లు ప్రాథమికంగా బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే, బయటకు వెల్లడించిన ఆ రహస్య సమాచారాన్ని దుర్వినియోగం చేశారా లేదా అనే కోణంలో విచారణ ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.

మరోవైపు, ఈ నెల 27వ తేదీన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త సీఈఓగా అనూప్ బాగ్చీ బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలోనే ఈ డేటా లీకేజీ వ్యవహారం బయటపడటం బ్యాంకింగ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశీయ ఆర్థిక వ్యవస్థలో ఎంతో ప్రాధాన్యత కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అంతర్గత భద్రత, డేటా నిర్వహణపై ఈ ఘటన పలు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.