అంగట్లో ప్రెస్.. అమ్మకానికి నాలుగో స్తంభం.. జర్నలిజం ముసుగులో నకిలీల దందా!

Journalism Scam

Journalism Scam

Journalism Scam: ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా, నిజాన్ని సమాజానికి చూపే అద్దంగా నిలవాల్సిన జర్నలిజం వ్యవస్థ నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సమాజంలో ఇప్పటికే జర్నలిస్టులు అంటే ‘ఎర్నలిస్టులు’ అనే భావన బలంగా నాటుకుపోగా, తాజాగా బయటపడుతున్న దందాలు ఈ రంగాన్ని మరింత దిగజారుస్తున్నాయి. జర్నలిస్టు గుర్తింపును ఆన్‌లైన్ వేదికగా అంగడి బొమ్మలా అమ్మకానికి పెట్టడం, దానికి కొందరు అమాయకులు, మరికొందరు అక్రమార్కులు కొనుగోలుదారులుగా మారడం పాత్రికేయ రంగానికి పట్టిన చీడగా పలువురు అభివర్ణిస్తున్నారు.

సమాజంలో అసలైన జర్నలిజం విలువలు ఎప్పుడో కనుమరుగైపోయాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మైకు చేతిలో పట్టుకుని, కెమెరా ముందు కనీస అవగాహన, విషయ పరిజ్ఞానం లేకుండా విన్యాసాలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా బయటపడిన సంచలన నిజాలు ఈ అక్రమాల స్థాయిని కళ్ళకు కడుతున్నాయి. జర్నలిస్టు గుర్తింపు ఇచ్చే ప్రెస్ ఐడీ కార్డులు, వాహనాలపై వేసుకునే ఐడీ స్టిక్కర్లు, చేతిలో పట్టుకునే ప్రెస్ మైకు ఐడీలను విచ్చలవిడిగా ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న దందా బయటపడింది.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న కొందరు ‘రిపోర్టర్ల’ తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నిశితంగా పరిశోధించింది. ఆ రిపోర్టర్లు పట్టుకున్న మైకులపై ఉన్న లోగోలను పరిశీలించి లోతుగా దర్యాప్తు చేయగా, అది ఏ రకమైన అధికారిక వార్తా సంస్థ కాదని తేలింది. కేవలం డబ్బులు తీసుకుని జర్నలిస్ట్ ఐడీ కార్డులు, ప్రెస్ మైక్ కిట్లను అక్రమంగా విక్రయించే ఒక ఆన్‌లైన్ వ్యాపార నెట్‌వర్క్ అని నిర్ధారణ అయింది. ఇలాంటి అక్రమ దందాలను బహిరంగంగా నడుపుతున్న కనీసం ఆరు వెబ్‌సైట్లను సదరు మీడియా పరిశోధక బృందం బహిర్గతం చేసింది.

జర్నలిజం విలువలు దిగజారిపోయి, వ్యాపారాత్మకంగా మారిపోయిన ఈ కాలంలో, నిజమైన పత్రికా స్వేచ్ఛను, విశ్వసనీయతను కాపాడటంలో సాంప్రదాయ మీడియా వైఫల్యం చెందుతోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయి నిజాలను, ప్రజల సమస్యలను ఎలాంటి భయాలు లేకుండా ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తెస్తూ సోషల్ మీడియా వేదికలే పాత్రికేయ విలువలను బతికిస్తున్నాయనే చర్చ సమాజంలో జరుగుతోంది. నకిలీ గుర్తింపులతో చలామణి అవుతూ జర్నలిజం వ్యవస్థకే మచ్చ తెస్తున్న అక్రమ వ్యాపార నెట్‌వర్క్‌లపై, నకిలీ రిపోర్టర్లపై ప్రభుత్వం, చట్టబద్ధమైన ప్రెస్ మండళ్లు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.