TELANGANA: కల్తీకి చెక్ పెట్టేలా ‘టీజీ సేఫ్’ !

మినిట్ 2 మినిట్, హైదరాబాద్(ఆగస్ట్ 17) : తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని కాపాడటంతో పాటు ఆహార భద్రత ప్రమాణాలను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. నాణ్యత లేని ఆహార పదార్థాలు, నకిలీ ఔషధాల విక్రయాలను అరికట్టడమే ప్రధాన ధ్యేయంగా ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్లను ఒకే తాటిపైకి తీసుకొచ్చింది. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ ‘టీజీ సేఫ్’ (TG SAFE) పేరిట ఉమ్మడి పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జె. జోంగ్తూ ఉత్తర్వులు (జీవో నంబర్ 67) జారీ చేశారు. ఈ నూతన ఉమ్మడి పరిపాలనా సంస్థకు పూర్తిస్థాయి నియంత్రణ అధికారిగా, ‘టీజీ సేఫ్’ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఉమ్మడి వ్యవస్థ పర్యవేక్షణలో మొత్తం ఆరు ప్రత్యేక విభాగాలు పనిచేయనున్నాయి. మొదటిది ‘డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వింగ్’ – ఇది డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 1940 కింద లైసెన్సుల మంజూరు, తనిఖీలు, శాంపిళ్ల పరీక్షలు, లోతైన దర్యాప్తు బాధ్యతలను చూసుకుంటుంది. రెండవది ‘ఫుడ్ సేఫ్టీ వింగ్’ – ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 కింద హోటళ్లు, వ్యాపార సంస్థల లైసెన్సులు, నమోదు, నిరంతర తనిఖీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను పర్యవేక్షిస్తుంది. మూడవది ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్’ – నిఘా సమాచారం సేకరించడం, ముందస్తు సమాచారంతో ప్రమాదకరమైన ప్రాంతాల్లో దాడులు జరపడం కోసం పోలీసు శాఖ నుంచి ప్రత్యేకంగా కేటాయించిన సిబ్బందితో ఇది పనిచేస్తుంది. నాలుగవది ‘లీగల్ అండ్ ప్రాసిక్యూషన్ వింగ్’ – కోర్టు కేసులు, వివాదాలు, చట్టపరమైన సలహాల కోసం ఇది ఉపయోగపడుతుంది. ఐదవది ‘లాబొరేటరీ వింగ్’ – ఆహార పదార్థాల పరిశీలనకు ఫుడ్ సేఫ్టీ ల్యాబ్, ఔషధాల నాణ్యతను తేల్చేందుకు డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లను విలీనం చేస్తూ దీనిని నిర్మించారు. ఆరవది ‘అడ్మినిస్ట్రేటివ్ వింగ్’ – మానవ వనరులు, బడ్జెట్ నిర్వహణ, ఖాతాల పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహిస్తుంది. ఈ సరికొత్త కంబైన్డ్ మెకానిజం ద్వారా రాష్ట్రంలో కల్తీ ఆహారం విక్రయించే వారిపై, నకిలీ మందులు సరఫరా చేసే ముఠాలపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులకు విస్తృత అధికారాలు లభించనున్నాయి. తనిఖీలు, చట్టపరమైన చర్యల ప్రక్రియ వేగవంతమై ప్రజా ఆరోగ్యం భద్రంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.