నీట్ పరీక్ష లీక్‌కు బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష (నిరశన) చేస్తున్న Sonam Wangchuk వ్రతభంగం చేశారు ఢిల్లీ పోలీసులు. దాన్ని నిరసిస్తూ తాను ఈ రోజు నుంచి ఆమరణ దీక్ష చేస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ప్రకటించారు.
అయితే, గత కొన్ని రోజులుగా వీళ్లిద్దరి మీద… ముఖ్యంగా వాంగ్ చుక్ మీద వస్తున్న వ్యాఖ్యలు కఠినంగా ఉన్నాయి. ఆయన దొంగచాటుగా తింటున్నాడని, ఆయన పోతే పీడా పోతుందని మహా కోపం, పగ, ద్వేషంతో రాస్తున్నారు. నాకు ఇది అర్థంకావడం లేదు.
లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మనోక్లేశం కలిగించి, పలువురి ఆత్మహత్యకు కారణమైన పేపర్ లీక్ విషయంలో జవాబుదారీతనం కోరుకున్న వ్యక్తి, పైగా రామన్ మేగ్సేసే అవార్డు గ్రహీత, చావు కోరుకోవడం అమర్యాదగా, అమానుషంగా అనిపించింది. నిరసన (protest)ను పట్టించుకోకపోతే fast unto death (నిరశన) చేస్తారు. అదీ ప్రజలకు సంబంధించిన అంశం మీద గాంధేయ మార్గంలో ధర్మాగ్రహం వ్యక్తం చేసిన విద్యావంతుడి మీద ఎందుకు అంత అక్కసు?
సర్వే జనా సుఖినో భవంతు అని బోధించిన హిందూ మతంలో పుట్టిన వాడిగా నేను ఒక వర్గం మూఢ స్పందనకు బాధపడుతున్నాను. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ ఇతోధికంగా ప్రజాస్వామ్యాన్ని సమాధి చేసే పనిలో ఉన్నా అది తెలియని అమాయకత్వంలో జనం ఉన్నారన్న సత్యాన్ని అర్ధం చేసుకున్నవాడిగా… మానవత్వమే మతం, కులం అని నమ్మే వాడిగా నేను ఈ మాట చెబుతున్నాను.
డీప్ స్టేట్, చైనా, ఇతరేతర భారత్ వ్యతిరేక శక్తుల కీలుబొమ్మ వాంగ్ చుక్ అన్న ఆరోపణ ప్రాతిపదికగా స్పందనలు ఉంటున్నాయి. ఈ ఆరోపణ నిజమేనా? దానికి ప్రాతిపదిక ఏమిటా? అన్నది నాకు దొరకలేదు. అదే నిజమైతే ప్రభుత్వం ఎప్పుడో ఆయన్ను శాశ్వతంగా జైలుకు పంపేది కదా! జైలుకి పంపి ఉండాల్సింది. నిజానికి ఆయన ఇవ్వాళ పుట్టుకొచ్చిన మనిషి కాదు. ప్రజల కోసం పోరాడే వ్యక్తి. ఒకవేళ ఆయన దేశ వ్యతిరేకి అయితే అది నిరూపించి వెంటనే ఉరి తీయవచ్చు కూడా. దేశమే అన్నిటికన్నా ప్రథమం అని నమ్మే నా లాంటి వాళ్ళు కూడా దాన్ని హర్షిస్తారు. లక్షల మంది త్యాగ ఫలం అయిన ఈ పుణ్యభూమి గాలి పీలిస్తూ, బతికేస్తూ ఈ దేశం మీద ద్వేషం కురిపించే ఎవ్వడూ ఇక్కడ ఉండడానికి వీలు లేదు.
అయితే, మన దేశంలో పరిస్థితులు మెరుగు పడి భావితరాలు బాగుండాలని గొంతు ఎత్తే వారు అంతా దేశ ద్రోహులు కాదు. ఈ వాంగ్ చుక్ గారు, ఆ అభిజిత్ మంచోళ్లో కాదో నాకు నిజంగా తెలియదు. కానీ వారు గళమెత్తిన అంశాలు చాలా ముఖ్యమైనవి. పేపర్ లీక్ విషయంలో accountability ఉండకూడదని మీతో సహా ఎవ్వరూ కోరుకోరు. ఒక సారి పార్టీలకు అతీతంగా ఇది ఆలోచించండి.
బీజేపీ నేతృత్వంలోని #NDA ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇపుడు జరిగే నిరసనలు, నిరశనలు దేశ ద్రోహం అన్న ప్రచారం జోరు అందుకుంది. ఆ మాయలో జనం పడుతున్నరని అనిపిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని #UPA ప్రభుత్వం ఉండి ఉంటే కూడా ఈ నిరశన పట్ల ఒక సెక్షన్ ఉద్దేశం ఇట్లానే ఉండేదా? ఇప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టుల హీరో అపుడు విలన్ అయ్యేవాడు. అపుడు ఆయనకు బత్తాయి అని ముద్రవేసే వారు కాదా? సోదరులారా, మనం గాడి తప్పుతున్నాం. ప్రతి దాన్ని మతం కోణంలో, పార్టీల కోణంలో చూడవద్దు. ధర్మాధర్మ వివేచన పోనివ్వకండి. పూర్వ ఉద్దేశాలతో (preconceived notions) తో చేసే నిర్ణయాలు మన దేశానికి మంచిది కాదు. Dissent అనేది మన ప్రజాస్వామ్యానికి మంచిదేనని గ్రహించండి. గుడ్డి అభిమానులతో కాకుండా దేశ హితం కోసం ఆలోచించండి.
ఎస్. రాము
సీనియర్ జర్నలిస్ట్ & విశ్లేషకులు
(ఫేస్ బుక్ వాల్ నుంచి)
