ANDHRAPRADESH: అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు!

బీసీలకు 34% రిజర్వేషన్లు!

గ్రామీణ ప్రాంతాల్లో 32%, పట్టణ ప్రాంతాల్లో 33.1 శాతం రిజర్వేషన్లు

అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు

మేయర్ అభ్యర్థుల ఎంపిక ప్రత్యక్ష పద్ధతిలోనే

57 కీలక అంశాలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

మినిట్ 2 మినిట్, అమరావతి (ఆగస్ట్ 19):  ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో సమావేశమైన ఏపీ మంత్రివర్గం ఏకంగా 57 కీలక అంశాలకు పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

నూతన రిజర్వేషన్ల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో (పంచాయతీలు, మండల పరిషత్‌లు) 32 శాతం, పట్టణ ప్రాంతాల్లో (పురపాలక, నగరపాలక సంస్థలు) 33.1 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావలసిన రూ.16,500 కోట్ల నిధులు మంజూరు కావాలంటే స్థానిక ఎన్నికలు తక్షణమే పూర్తి చేయాల్సి ఉన్నందున, అక్టోబర్‌లోగా ఎన్నికల ప్రక్రియను ముగించాలని కేబినెట్ నిర్ణయించింది.

కేబినెట్ సమావేశంలో తీసుకున్న మరికొన్ని కీలక నిర్ణయాలు:

ప్రత్యక్ష పద్ధతిలోనే మేయర్ ఎన్నిక: ఇకపై మేయర్లను ప్రజలే నేరుగా ఎన్నుకునేలా ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. అలాగే గతంలో ఉన్న పాత పద్ధతి ప్రకారమే ఒక్క డిప్యూటీ మేయర్ పదవికే పరిమితం కానున్నట్లు తీర్మానించారు.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఖరారు: గవర్నర్ కోటా కింద ఖాళీగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను కేబినెట్ ఖరారు చేసింది. సీనియర్ నాయకుడు వర్ల రామయ్య, దళవాయి రమాదేవి పేర్లను భర్తీ చేయాల్సిందిగా ప్రతిపాదించింది.

పారిశ్రామిక అభివృద్ధికి ఆమోదం: కర్నూలులో అగ్రిగోల్డ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు, విశాఖలో అక్షత్ గ్రీన్‌టెక్ సోలార్ సెల్, డేటా సెంటర్లు, తిరుపతి, సూర్యలంక, కేసరిపల్లి, కాకినాడలో స్టార్ హోటళ్ల ఏర్పాటు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.