Kakinada crime: కోట్లాది రూపాయల ఆస్తి దాహంతో ఒక పక్క అల్లుడికి విషమిచ్చి దారుణంగా హత్య చేసి.. మరోపక్క ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్యకు కారణమైన ఉన్మాది సాధిక్ ఖాన్ రాక్షస నేరకోణం విచారణలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. సుమారు రూ.25 కోట్ల విలువైన ఆస్తిని కాజేసేందుకు వేసిన సైకో స్కెచ్ కాకినాడ ప్రాంతాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రెండు రోజులుగా సర్పవరం పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు సాధిక్ ఖాన్ ‘గుర్తులేదు, తెలియదు’ అంటూ విచారణకు సహకరించకపోవడంతో, పోలీసులు సాంకేతిక ఆధారాలతో రంగంలోకి దిగి అతని గుట్టు విప్పారు.
హైదరాబాద్‌లో సైనైడ్ కొనుగోలు.. పక్కా ఆధారాలు!
నిందితుడు సాధిక్ ఖాన్‌ను సర్పవరం సీఐ సీహెచ్ ప్రకాష్ బృందం సుమారు 200 ప్రశ్నలతో విచారించింది. మొదట ఏమీ తెలియనట్లు బుకాయించినప్పటికీ, హైదరాబాద్ అత్తరు వ్యాపారుల వద్ద సైనైడ్ కొనుగోలు చేసిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు ముందుంచడంతో సాధిక్ లొంగిపోయాడు. జగదీశ్వరరెడ్డిని మట్టుబెట్టేందుకు కొబ్బరి నీళ్లలో సైనైడ్ కలిపి ఇచ్చానని, ఆపై అతను కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా మూడ్నాలుగు సార్లు విషం అందించానని ఒప్పుకున్నాడు. అనంతరం హైదరాబాద్‌లో కోలుకుని తిరిగొచ్చిన జగదీశ్వరరెడ్డికి మళ్లీ విష పదార్థం పంపించడంతో, అది వాడిన మరుసటి రోజే అతడు మృతి చెందినట్లు విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు వెల్లడించాడు.
రూ.25 కోట్ల ఆస్తి పైనే కన్ను
ఈ ఘాతుకం వెనుక రావులపాలెంలో ఉన్న రూ.25 కోట్ల విలువైన నూకరాజు కుటుంబ ఆస్తులే కారణమని తేలింది. జగదీశ్వరరెడ్డిని అడ్డు తొలగించుకున్న తర్వాత ఆయన భార్య సౌజన్యను పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని సాధిక్ పథకం వేశాడు. అయితే సౌజన్య తండ్రి ఏఈ నూకరాజు ఈ పెళ్లికి నిరాకరించి, ఆస్తిని మనవడు కార్తికేయరెడ్డి పేరిట రాస్తామని స్పష్టం చేయడంతో సాధిక్ తట్టుకోలేకపోయాడు. “ఆస్తి కోసమే నేను ఇదంతా చేస్తే, వేరే వాళ్లకు ఎలా రాసిస్తారు?” అంటూ నూకరాజు కుటుంబంతో తీవ్రంగా గొడవపడి, అందరినీ చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. అతడి మానసిక నరకం, బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేకే నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు గోదావరి వారధిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
షూటింగ్ అకాడమీ సీజ్.. సీన్ రీకన్స్ట్రక్షన్
కేసు విచారణలో భాగంగా సర్పవరం సీఐ ప్రకాష్ ఆధ్వర్యంలో గుడారిగుంటలోని సాధిక్‌కు చెందిన ‘ప్రో రైఫిల్ షూటింగ్ అకాడమీ’లో సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. అకాడమీలోని 30 శిక్షణ రైఫిల్స్, ల్యాప్‌టాప్‌లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని అకాడమీని సీజ్ చేశారు. ఆయుధాల అనుమతులు, శిక్షణ అర్హతలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సౌజన్య కుమారుడిని అకాడమీకి తీసుకెళ్లే మిషతో సాధిక్ ఆమెపై దృష్టి సారించి, తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించాడని విచారణలో తేలింది. తప్పును సౌజన్యపైకి నెట్టేందుకు నిందితుడు ప్రయత్నించినప్పటికీ, సాంకేతిక ఆధారాలు, సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసును బిగించారు. జగదీశ్వరరెడ్డికి చెందిన ఖరీదైన కార్లను ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, తదుపరి విచారణ కోసం నిందితుడిని మరోసారి కస్టడీకి కోరేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. రూ.25 కోట్ల ఆస్తి మోజులో నలుగురి ప్రాణాలు తీసిన ఈ క్రైమ్ మిస్టరీని పక్కా ఆధారాలతో ఛార్జ్‌షీట్ సిద్ధం చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు వెల్లడించారు.
