Ganesh Immersion: హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలు, వ్యతిరేక ప్రచారాలపై హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు. నగరం పరిధిలో చెరువుల్లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి హైడ్రా ఎప్పుడూ వ్యతిరేకం కాదని, పునరుద్ధరణ పనులు చేపడుతున్న చెరువుల వద్ద నిమజ్జనాలకు ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు ఎవరూ నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నోటిఫై చేసిన నాలుగైదు సున్నితమైన చెరువుల వద్ద మాత్రమే ఆంక్షలు అమలులో ఉన్నాయని కమిషనర్ వెల్లడించారు. దేశంలోనే మొదటి బయో డైవర్సిటీగా గుర్తింపు పొందిన అమీన్పూర్ చెరువు, నేచురల్ వెట్ల్యాండ్గా రక్షణ ఉన్న కాప్రా చెరువులు మాత్రమే ఈ జాబితాలో ఉన్నాయన్నారు. కాప్రా చెరువులో ప్రస్తుతం నీరు లేని దృష్ట్యా అక్కడ ఎవరూ అనవసర సమస్యలు సృష్టించవద్దని కోరారు.
నగరంలోని మిగిలిన అన్ని ప్రధాన చెరువులు, జలాశయాల్లో వినాయక నిమజ్జనాలు ఎప్పటిలాగే యథావిధిగా సాగుతాయని స్పష్టం చేశారు. ప్రధాన నీటి వనరులు, చెరువుల పర్యావరణం దెబ్బతినకుండా ఉండేందుకు, భక్తులు మరియు ఉత్సవ కమిటీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జీహెచ్ఎంసీతో కలిసి విస్తృతంగా ‘బేబీ పాండ్స్’ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలను ప్రశాంతంగా, పర్యావరణ హితంగా జరుపుకునేలా ఉత్సవ సమితి ప్రతినిధులు, నగర ప్రజలు సహకరించాలని ఏవీ రంగనాథ్ కోరారు.
