Traffic Diversions: హైదరాబాద్ ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. ఈనెల 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఖైరతాబాద్, పరిసర ప్రాంతాల్లో పలు ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు అమల్లో ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు పరిస్థితిని బట్టి వాహనాలను దారి మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు.
వీవీ విగ్రహం వైపు సాగే వాహనాలను నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు. పాత పీఎస్ సైఫాబాద్ నుంచి బడా గణేశ్ వైపు వాహనాలకు అనుమతి ఉండదు. రాజ్‌దూత్ లేన్ వద్ద వాహనాలను ఇక్బాల్ మినార్ వైపు దారి మళ్లిస్తారు. మింట్ కాంపౌండ్ వద్ద సెక్రటేరియట్ ఎక్స్ రోడ్డు వైపు, నెక్లెస్ రోటరీ వద్ద పరిస్థితిని బట్టి నిరంకారి లేదా ఫ్లైఓవర్ వైపు పంపుతారు.
లకడీకాపూల్, ఖైరతాబాద్, సైఫాబాద్, ఐమాక్స్ పరిసరాల్లో భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు కోరారు. భక్తుల కోసం రేస్ కోర్స్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్, ఐమాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాలు, విశ్వేశ్వరయ్య భవన్ వద్ద పార్కింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రాఫిక్ అత్యవసర సహాయం కోసం 9010203626 నంబరును సంప్రదించాలని పోలీసులు సూచించారు.
