Shiva Bhajan: లోకకల్యాణం కోసం దేవస్థానం శ్రావణమాసం సందర్భంగా నిర్వహించిన చతుస్సప్తాహ శివ భజనలు భాద్రపద శుక్ల పాడ్యమి అయిన ఈ రోజు ( 12.09.2026 )తో ముగిసాయి. శ్రావణశుద్ధ పాడ్యమి రోజున (13.08.2026) ఈ అఖండ భజనలు ప్రారంభించబడ్డాయి. కాగా శ్రావణమాసమంతా కూడా నిరంతరాయంగా రేయిoబవళ్ళు అఖండ శివపంచాక్షరి నామభజనను చేయడం జరిగింది. ఆలయప్రాoగణములోని వీరశిరోమండపంలో ఈ విశేషకార్యక్రమo నిర్వహించబడినది.
కర్నూలు నగరానికి చెందిన అయిదు భజన బృందాలకు మరియు కర్ణాటకకు చెందిన రెండు భజన బృందాలకు ఈ శ్రావణమాస శివభజనలు చేయడానికి అవకాశం కల్పించబడింది.
శ్రీసుంకులమ్మదేవి భజన మండలి వారు ( 13.08.2026 నుండి 17.08.2026వరకు), శ్రీ రామాంజనేయ భజనమండలివారు ( 17.08.2026 నుండి 21.07.2026 వరకు) శ్రీ లక్ష్మీ చెన్నకేశవ భజన బృందం వారు ( 21.08.2026 నుండి 25.08.2026 వరకు ) , శ్రీ లక్ష్మీ చెన్నకేశవ నాటక కళా భజన మండలి వారు ( 25.08.2026 నుండి 29.08.2026 వరకు ) శ్రీ గురునిమిషాంబాదేవి భజన మండలి వారు ( 29.08.2026 నుండి 02.08.2026 వరకు), మల్లికార్జున భజన సంఘం, సుంకేశ్వరాహాల్, రాయచూరు జిల్లా మరియు ప్రభులింగ సేవా సంఘం, గోపన దేవర హళ్లి, రాయచూరు జిల్లా, కర్ణాటక రాష్ట్రం వారు ( 02.09.2026 నుండి 12.09.2026 వరకు ) ఈ అఖండ శివభజనలలో పాల్గొన్నారు.
పవిత్ర శ్రావణమాసములో శివనామస్మరణ అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని లోక కల్యాణం కోసం ప్రతీ సంవతర్సరం శ్రావణమాసములో దేవస్థానం అఖండ చతుస్సప్తాహ శివ భజనలు నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమములో సహాయ కార్యనిర్వహణాధికారి కె. వెంకటేశ్వరరావు, శ్రీస్వామివార్ల ప్రధానార్చకులు హెచ్. వీరయ్యస్వామి, పర్యవేక్షకులు హరియానాయక్, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
