Bhagavad Gita: మార్మోగిన గీతా శ్లోకాలు.. భక్తిశ్రద్ధలతో శ్రీమద్భగవద్గీతా పారాయణం!

Bhagavad Gita pathanam

యాచారం (జూన్ 29): కొత్తపల్లి గ్రామంలో సోమవారం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. చంపాపేట విష్ణు సహస్రనామ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీమద్భగవద్గీతా పారాయణం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై, భగవద్గీత శ్లోకాలను ఆలపించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, బృందం సభ్యులతో కలిసి గ్రామస్థులు శ్లోకాలను భక్తితో అనుసరించారు. దీంతో ప్రాంగణమంతా గీతా నాదంతో మారుమోగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు సోమ రంగయ్య, సత్యనారాయణ మాట్లాడుతూ.. భగవద్గీత మనిషికి ధర్మమార్గాన్ని చూపి, జీవితంలోని కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే స్ఫూర్తిని ఇస్తుందన్నారు. యువతలో ఆధ్యాత్మికతను, సనాతన ధర్మ విలువలను పెంపొందించేందుకే ఈ పారాయణాలు నిర్వహిస్తున్నట్లు చంపాపేట బృందం తెలిపింది. ఈ కార్యక్రమంలో సోమ నరేష్, జిల్లెల్ల యాదిరెడ్డి, మాల్ రెడ్డి విష్ణు రెడ్డి, శ్రీనివాసా చారి, లక్ష్మి, పద్మ, రాములమ్మ తదితర భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.