తుమకూరు: కర్ణాటకలో సినిమా సీన్‌ను తలపించేలా అత్యంత భయానక, సంచలన ఘటన వెలుగుచూసింది. ప్రేమను నిరాకరించిందన్న కక్షతో ఓ ఉన్మాది.. తన మాజీ ప్రేయసిని కిడ్నాప్ చేసి, కత్తితో దాడి చేయడమే కాకుండా.. ఏకంగా కారులోనే బాంబు పేల్చాడు. ఈ ఘోర ప్రమాదంలో నిందితుడు అక్కడికక్కడే సజీవ దహనమవ్వగా, క్యాబ్ డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల సదరు మహిళ తృటిలో ప్రాణాలతో బయటపడింది.
అసలేం జరిగిందంటే..?
పోలీసుల సమాచారం ప్రకారం.. కర్ణాటకలోని తుమకూరు సమీపంలో జాతీయ రహదారి-48 (NH-48)పై ఓ క్యాబ్ వేగంగా ప్రయాణిస్తోంది. ఆ కారులో ఒక మహిళ, ఆమె మాజీ ప్రియుడు ఉన్నారు. పాత కక్షల నేపథ్యంలో వారిద్దరి మధ్య కారులోనే తీవ్రమైన గొడవ జరిగింది. ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన సదరు వ్యక్తి, తన వెంట తెచ్చుకున్న కత్తితో మహిళపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. కత్తితో దాడి చేయడమే గాక, ఆ ఉన్మాది తన వద్ద ఉన్న బాంబును కారులోనే పేల్చడానికి సిద్ధమయ్యాడు.
క్యాబ్ డ్రైవర్ సమయస్ఫూర్తి..!
కారులో బాంబు పేల్చేందుకు నిందితుడు ప్రయత్నిస్తున్న విషయాన్ని వెనుక సీట్లోని కదలికల ద్వారా క్యాబ్ డ్రైవర్ గమనించాడు. ప్రమాదాన్ని ముందే ఊహించి అలర్ట్ అయిన డ్రైవర్.. వెంటనే వాహనాన్ని హైవే పక్కన నిలిపివేశాడు. తీవ్ర రక్తస్రావంతో కారులో పడి ఉన్న మహిళను క్షణాల వ్యవధిలో కారు బయటకు లాగాడు. వారు కారు నుంచి కిందకు దిగి సురక్షిత ప్రాంతానికి పరుగులు తీసిన కొద్దిసేపటికే.. కారులో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. కారు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది.
నిందితుడు ఖతమ్.. బాధితురాలు సేఫ్
ఈ భీకర బాంబు పేలుడులో కారులోనే ఉండిపోయిన నిందితుడు అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు. తీవ్రంగా గాయపడిన మహిళను క్యాబ్ డ్రైవర్, స్థానికుల సహాయంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తుండగా, ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు సమాచారం. హైవేపై కారు పేలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఆ వ్యక్తి కారులోకి బాంబు ఎలా తీసుకువచ్చాడు? ఆ బాంబు ఎలాంటిది? అనే కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.
