తెర వెనుక కార్మికుల పిల్లలకు ఉచిత NEET, IIT కోచింగ్.. కాదంబరి కిరణ్ సంచలన నిర్ణయం!

Manam Saitham

Manam Saitham

Manam Saitham: సమాజంలో కష్టాల్లో ఉన్నవారికి చేయూతనందిస్తూ, సేవను ఒక కార్యక్రమంగా మాత్రమే కాకుండా ఓ పవిత్రమైన బాధ్యతగా నిర్వహిస్తూ వస్తోంది ‘మనం సైతం’ ఫౌండేషన్. నటుడు, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ నాయకత్వంలో గడిచిన 13 ఏళ్లుగా ఈ సంస్థ అనేకమంది పేదలకు, అవసరార్థులకు ఆపద్బాంధవుడిగా నిలిచింది. ఈ పదిమూడేళ్ల ప్రయాణంలో సాధించిన అనుభవంతో, సేవా దృక్పథాన్ని మరిన్ని విభాగానికి విస్తరించే లక్ష్యంతో ఇప్పుడు ‘సపర్య – వుయ్ కేర్ ఫర్ అన్ కేర్డ్’ అనే బృహత్తర ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. హైదరాబాదులోని తెలుగు ఫిలిం ఛాంబర్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కాదంబరి కిరణ్ ఈ వివరాలను అధికారికంగా వెల్లడించారు.

ప్రశాంతమైన వాతావరణంలో ‘ఆశ్రమం’ & ‘జనతా వైద్యం’

‘సపర్య’ ప్రాజెక్టు ద్వారా అనాథలకు, నిరాశ్రయులైన వృద్ధులకు నీడను ఇవ్వడంతో పాటు, నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ‘జనతా వైద్యం’ ఆసుపత్రిని నెలకొల్పుతున్నారు. కేవలం చికిత్సకే పరిమితం కాకుండా, మానసిక ప్రశాంతతను ఇచ్చేలా ఈ ప్రాజెక్టు ప్రాంగణాన్ని తీర్చిదిద్దనున్నారు. విశాలమైన వాటర్ పాండ్, దాని చుట్టూ ఆహ్లాదకరమైన వాకింగ్ ట్రాక్, పచ్చని వనం, గదులకు గాజు తలుపులు వంటి వసతులతో ఒత్తిడి లేని ప్రశాంత వాతావరణాన్ని అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. వసతి, వైద్యం, ప్రేమ పూర్వక ఆత్మీయతలను ఒకే వేదికపై అందించేందుకు ఈ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది.

ఒంటరి వృద్ధులకు కంటిపాపలా ఆత్మీయ ఆసరా

ఆధునిక జీవనశైలి, పిల్లలు ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం వల్ల నేటి కాలంలో ఎంతోమంది వృద్ధులు ఇళ్లల్లో ఒంటరితనంతో నరకం అనుభవిస్తున్నారు. అలాంటి వారికి ‘మేమున్నాం’ అనే కొండంత భరోసా ఇచ్చేందుకే ‘సపర్య’ ముందడుగు వేసింది. అనురాగం కరువైన వయోవృద్ధులను ఆదరించి, వారికి కావాల్సిన వైద్య సదుపాయాలు, నివాసం, మానసిక ఆసరాను కల్పించడం ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటిగా కాదంబరి కిరణ్ పేర్కొన్నారు.

సినీ కార్మికుల పిల్లలకు ఉచిత నీట్, ఐఐటీ శిక్షణ

సేవా కార్యక్రమాలను కేవలం అన్నదానాలు, వైద్య సాయానికే పరిమితం చేయకుండా విద్యారంగానికి విస్తరించారు. ‘క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఫౌండేషన్’ భాగస్వామ్యంతో సినీ పరిశ్రమలోని తెర వెనుక కార్మికుల పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేసే వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. దీని ప్రకారం ప్రతి ఏటా ఐదుగురు విద్యార్థులకు ఉచిత హాస్టల్ వసతితో పాటు రెండేళ్ల నీట్ (NEET) ప్రవేశ పరీక్ష శిక్షణను, మరో ఐదుగురికి ఉచిత ఐఐటీ (IIT) కోచింగ్‌ను అందిస్తారు. సినిమా రంగానికి సేవలందిస్తున్న నిరుపేద కార్మికుల బిడ్డలు ఉన్నత విద్యావంతులుగా ఎదిగేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది.

‘‘పేదవాళ్లే నా కుటుంబం’’: అందరి సహకారంతోనే మానవీయ ఉద్యమం

తన 40 సంవత్సరాల సినీ జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, కష్టాలే తనను సేవా బాట పట్టించాయని కాదంబరి కిరణ్ గుర్తు చేసుకున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ద్వేషం పెంచుకోవడం కంటే, తోటివారికి సహాయం చేయడంలోనే అసలైన సంతృప్తి ఉందనే నమ్మకంతో ‘మనం సైతం’ ఏర్పడిందని తెలిపారు. ‘‘పేదవాళ్లే నా కుటుంబం.. దేవుడు మనకు అవకాశమిచ్చినప్పుడు మరో చేతితో నిరుపేదలను ఆదుకోవాలి’’ అని స్పష్టం చేశారు. ‘సర్వీస్ ఈజ్ గాడ్’ అనే నినాదంతో సాగుతున్న ఈ ప్రయాణంలో దాతలు, సినీ ప్రముఖులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.