ధూమ్రావతి దేవి కథనమా.. కేజీఎఫ్ తరహా మాతృపాశమా? ‘ది ప్యారడైజ్’ సస్పెన్స్‌కి రేపే తెర!

The Paradise

The Paradise

The Paradise: సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్ రాసిన ఈ అగ్నికణాల్లాంటి అక్షరాలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, సహజ నటుడు నాని కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా ఆత్మను ఈ మాటలు ప్రతిబింబిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రోజు మాత్రమే సమయం ఉంది. విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ సినీ ప్రియుల్లో అంచనాలు అంబరాన్నంటుతున్నాయి.

తాజాగా విడుదలైన ‘‘కండ్లల్ల కన్నీళ్లు సమ్మక్క.. నీ రొమ్ములకెట్లొచ్చే సమ్మక్క’’ పాట సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేసింది. ఇప్పటివరకు వచ్చిన పాటలు ఒకెత్తు అయితే, ఈ సమ్మక్క పాట కథలోని గాఢతను తెలియజేస్తూ మరో ఎత్తుగా నిలిచింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన మనోనేత్రంతో ఆవిష్కరించిన ‘ప్యారడైజ్’ ప్రపంచం, దానికి నాని ‘నటరాజ విన్యాసం’ గురించి సినీ వర్గాలు విశేషంగా మాట్లాడుకుంటున్నాయి. కాసర్ల శ్యామ్ తన కలంతో అక్షర తపస్సు చేశారని, సంగీత దర్శకుడు అనిరుధ్ ప్రాణం పోశాడని విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అయితే ఈ సినిమా అసలు కథ ఏమిటనే దానిపై అనేక ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. దర్శకుడు చెప్పినట్లు ఇది కేవలం తల్లి, కొడుకుల సెంటిమెంట్ కథేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తల్లి సెంటిమెంట్ నేపథ్యంతో ఇప్పటికే ‘కేజీఎఫ్’ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చాయి. అలాంటప్పుడు ఈ సినిమాలో చూపించబోయే కొత్తదనం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక అణచివేయబడ్డ తల్లి కథను కొడుకు ఏ కోణంలో ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాడు? ‘ఆయా షేర్’ పాటలో హీరోయిజాన్ని పతాక స్థాయిలో చూపిస్తే, ‘సమ్మక్క’ పాటలో ఒక తల్లి హృదయ విదారక జీవితాన్ని ఆవిష్కరించారు.

అట్టడుగు వర్గాల జీవన పోరాటమే ఈ చిత్రానికి ప్రాణమా? ఇది కేవలం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కథా లేక ప్రపంచంలో ఎక్కడైనా అణచివేతకు గురై అసమాన ధైర్యసాహసాలతో సింహాసనాన్ని అధిష్టించిన వీరుల గాథా అనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ఈ కథలో దశమహావిద్యలలో ఏడో అమ్మవారైన ‘ధూమ్రావతి దేవి’ కథనం కూడా అంతర్లీనంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ దేవి అనుగ్రహం ఎవరికి దక్కుతుంది? ఎవరికి ఆ తల్లి అండగా నిలుస్తుంది అనే కోణం కథపై మరింత ఆసక్తిని పెంచుతోంది. వీటన్నింటికీ రేపటితో సమాధానం దొరకనుంది.