ఆదాయం పీక్స్.. లాభాలు పాకేస్.. భారత్‌లో శాంసంగ్ ఊహించని పతనం, కారణాలివే!

Samsung India

Samsung India

Samsung India: భారతీయ ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లో దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న దక్షిణ కొరియా దిగ్గజం ‘శాంసంగ్’ అనూహ్య ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వెలువడిన ఆర్థిక గణాంకాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కంపెనీ ఆదాయం మెరుగ్గానే ఉన్నప్పటికీ, నిర్వహణ ఖర్చులు పెరగడం, మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో నికర లాభాల్లో ఏకంగా 36 శాతం మేర భారీ కోత పడింది. టోఫ్లర్ సమాచారం ప్రకారం, గతేడాది రూ.11,287.50 కోట్లుగా ఉన్న కన్సాలిడేటెడ్ నికర లాభం ఈ ఏడాది నాటికి రూ.7,228.10 కోట్లకు పరిమితమైంది.

అమ్మకాలు పర్వాలేదు.. కానీ లాభాలకే గండి

లాభాలు పడిపోయినప్పటికీ, భారత మార్కెట్‌లో శాంసంగ్‌కు ఉన్న డిమాండ్ పూర్తిగా తగ్గలేదని ఆర్థిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కంపెనీ నిర్వహణ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 1.2 శాతం పెరిగి రూ.1.12 లక్షల కోట్లకు చేరింది. ఇతర ఆదాయ మార్గాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం కన్సాలిడేటెడ్ ఆదాయం దాదాపు రూ.1.14 లక్షల కోట్లకు పైగానే నమోదైంది. దేశీయ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మరియు అప్లయెన్సెస్ రంగంలో రూ.1 లక్ష కోట్ల మైలురాయిని దాటిన ఏకైక సంస్థగా శాంసంగ్ తన రికార్డును పటిష్టంగానే నిలబెట్టుకుంది.

తీవ్ర పోటీ.. విపరీతంగా పెరిగిన నిర్వహణ వ్యయం

ఈ స్థాయి ఆదాయం వచ్చినా లాభాలు ఇంతలా పడిపోవడానికి ప్రధాన కారణం మార్కెట్‌లో నెలకొన్న తీవ్రమైన పోటీ, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులే. భారత్‌లో స్మార్ట్‌ఫోన్, టీవీ, హోమ్ అప్లయన్సెస్ విభాగాల్లో చైనీస్ బ్రాండ్లతో పాటు దేశీయ, అంతర్జాతీయ కంపెనీల నుంచి శాంసంగ్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. వినియోగదారులను ఆకట్టుకోవడానికి విపరీతంగా ప్రచార వ్యయాలు పెంచాల్సి రావడం, ముడిసరుకుల ధరల హెచ్చుతగ్గులు మరియు ద్రవ్యోల్బణం వల్ల సరఫరా వ్యవస్థ ఖర్చులు పెరగడం కంపెనీ లాభదాయకతను దెబ్బతీశాయి.

సవాళ్ల నడుమ ఉద్యోగుల కోతలు.. భవిష్యత్తు వ్యూహాలు

లాభాలు తగ్గడం మరియు వినియోగదారుల డిమాండ్‌లో వచ్చిన మందగమనం కారణంగా శాంసంగ్ ఇండియా కఠిన నిర్ణయాల బాట పట్టింది. వ్యయ నియంత్రణలో భాగంగా టీవీ, గృహోపకరణాల విభాగాల్లో పలు ఉద్యోగాల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. బ్రాంచ్ మేనేజర్లు, ఏరియా మేనేజర్లు, టీమ్ లీడర్ల స్థాయి అధికారుల వరకు ఈ లేఆఫ్స్ ప్రభావం పడినట్లు తెలుస్తోంది. ప్రధాన ఆదాయ వనరైన మొబైల్ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకుంటూనే, నష్టాలను తగ్గించుకునేందుకు సంస్థాత్మక రీస్ట్రక్చరింగ్‌పై కంపెనీ దృష్టి సారించింది.