Cocaine Seizure: మాదకద్రవ్యాల రవాణాకు స్మగ్లర్లు ఎన్ని కొత్త దారులు తొక్కినా భద్రతా దళాల నిఘా ముందు వారి పప్పులు ఉడకడం లేదు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా సాగుతున్న భారీ డ్రగ్స్ రాకెట్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు శోధించి రట్టు చేశారు. చాక్లెట్ల రూపంలో కొకైన్‌ను మార్చి, లగేజీ బ్యాగుల్లో రహస్యంగా దాచి రవాణా చేస్తున్న ఓ విదేశీ ప్రయాణికుడిని అధికారులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
దోహా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన సదరు ప్రయాణికుడిపై ముందస్తుగా వచ్చిన పక్కా సమాచారంతో అధికారులు నిఘా పెట్టారు. విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది సహకారంతో అతడిని అదుపులోకి తీసుకుని లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ప్రయాణికుడి బ్యాగుల్లో చాక్లెట్ కవర్లలో దాచిన పదార్థాన్ని చూసి అనుమానించారు. అనంతరం సదరు పదార్థాన్ని రసాయన పరీక్షలకు పంపించగా, అది అత్యంత రకానికి చెందిన కొకైన్ అని నిర్ధారణ అయింది. స్వాధీనం చేసుకున్న ఈ కొకైన్ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.24 కోట్ల విలువ ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. ఈ కొకైన్ ఎక్కడి నుంచి సరఫరా అయింది, దీని వెనుక ఏవైనా అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ హస్తం ఉందా, హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో ఎవరికి చేరవేసేందుకు ఈ కుట్ర పన్నారు అనే పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు శంషాబాద్ ప్రాంతంలో గంజాయి, మెథాంఫెటమైన్ విక్రయిస్తున్న మరో ముగ్గురు నిందితులను కూడా స్థానిక పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.
