ఖజానాపై భారం పడ్డా పేదల సంక్షేమ పథకాలు ఆపే ప్రసక్తే లేదు: మంత్రి పొంగులేటి

Podu lands

Podu lands

Podu lands: రాష్ట్ర ఖజానాపై ఎంతటి ఆర్థిక ఒత్తిడి ఉన్నప్పటికీ పేదల సంక్షేమానికి ఉద్దేశించిన ఏ ఒక్క పథకాన్ని నిలిపివేయబోమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపి, అర్హులైన పేదలందరికీ పట్టాలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యంగా పోడు భూముల సమస్యపై త్వరలోనే శుభవార్త వినిపిస్తామని వెల్లడించారు.

రేగళ్ల గ్రామపంచాయతీలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మండల సర్వసభ్య సమావేశంలో మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేలు అందించడంతో పాటు పంటలకు మద్దతు ధర, సన్న బియ్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీని విజయవంతంగా అమలు చేశామని గుర్తుచేశారు.

సంక్షేమ పాలనలో భాగంగా పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా అందుబాటులోకి తెస్తున్నామన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన గ్రాడ్యుయేట్లు అందరినీ ఓటర్లుగా నమోదు చేయించేలా పార్టీ శ్రేణులు గ్రామాల వారీగా ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు.