Srisailam Dasara: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్న దసరా మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని దేవస్థాన అధికారులు, నిర్వాహకులు ఆహ్వానించారు.
మంగళవారం అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంపూర్వకంగా కలిసిన దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చక పండితులు అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వేదపండితులు సీఎం చంద్రబాబుకు వేదాశీర్వచనం అందించి, శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, శ్రీస్వామి అమ్మవార్ల జ్ఞాపికను బహూకరించారు.
ఉత్సవ ఏర్పాట్లపై సీఎం ఆరా – పాల్గొన్న ప్రముఖులు
ఈ సమావేశంలో భాగంగా శ్రీశైలంలో దసరా ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం దేవస్థానం చేపడుతున్న ఏర్పాట్లు, భద్రత, వసతి తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉత్సవాలకు వచ్చే ప్రతి ఒక్క భక్తునికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి, దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో ఎం. శ్రీనివాసరావు, అర్చకస్వాములు వేద పండితులు పాల్గొన్నారు.
