సీఈసీ రాజీనామా డిమాండ్‌తో ఢిల్లీలో హైడ్రామా.. ధ్రువ్ రాఠీ, మమతా బెనర్జీ సహా ప్రముఖుల అరెస్ట్!

CJP Delhi

CJP Delhi

CJP Delhi: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన ప్రదర్శనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. శనివారం ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు జరిపిన భారీ మెగా క్రాక్‌డౌన్‌లో 4,000 మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

40 వేల మంది పోలీసులతో రాజధాని అష్టదిగ్బంధనం

ఆందోళనకారులు జంతర్ మంతర్ చేరకుండా అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు, కేంద్రీయ సాయుధ పోలీసు బలగాలకు చెందిన దాదాపు 40,000 మంది సిబ్బందిని రంగంలోకి దించారు. రహదారులపై భారీ బారికేడ్లు, ముళ్ల కంచెలు (స్పైక్ స్ట్రిప్స్) ఏర్పాటు చేసి నగరమంతటా కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ అణచివేత చర్యల్లో భాగంగా నిరసనలకు మద్దతుగా నిలిచిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, విద్యార్థి నేత నేహా బోరాలను పోలీసులు కొంతసేపు డిటైన్ చేసి అనంతరం విడుదల చేశారు.

నేతల ఆచూకీపై సీజేపీ ఆందోళన.. నేడు మళ్లీ మార్చ్!

ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, ముఖ్య నేతలు సౌరవ్ దాస్, అశుతోష్‌లను పోలీసులు నేరుగా విమానంలోకి ప్రవేశించి అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎక్కడికి తరలించారో తెలియకపోవడంపై సీజేపీ నేత అజింక్యా షిండే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ అగ్రనేతల భద్రతపై హెచ్చరించిన ఆయన, పోలీసుల అరెస్టులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు జర్మనీ నుంచి భారత్‌కు వచ్చిన ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు మళ్లీ జంతర్ మంతర్ వైపు మార్చ్‌ను కొనసాగిస్తామని, తమ డిమాండ్లు నెరవేరే వరకు అక్కడే తిష్ఠ వేస్తామని ప్రకటించారు. ప్రత్యేక తీవ్రమైన ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని, లక్షలాది మంది ఓట్లను తొలగించారని ఆరోపిస్తూ సీఈసీ రాజీనామా కోరుతున్న సీజేపీకి పలు ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతుండటంతో ఢిల్లీలో ఉత్కంఠ వాతావరణం కొనసాగుతోంది.

రంగంలోకి ‘పింక్ ఫోర్స్’ 
శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక మహిళా విభాగం ‘పింక్ ఫోర్స్’ను పోలీసులు రంగంలోకి దించారు. ఇటీవల రాజధానిలో జరిగిన వివిధ నిరసన కార్యక్రమాల సందర్భంగా విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారులపై ఆందోళనకారులు దురుసుగా ప్రవర్తించడంతో ఉన్నతాధికారులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా నిరసనకారులను నియంత్రించడంతో పాటు, భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఈ దళాలను కీలక ప్రాంతాల్లో మోహరించారు.

తెలుగు రాష్ట్రాల నాయకుల ముందస్తు అరెస్టులు
ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్లో పాల్గొనేందుకు రైళ్ల ద్వారా వెళ్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీజేపీ నేతలను రైల్వే పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. తెలంగాణ సీజేపీ నేతలు స్వామి కొరాణి, రంగసాయిరెడ్డి, రాజేష్ కొరపాక, వెంకటేష్ గౌడ్‌లతో పాటు పలువురిని రైలు నుంచి దింపేసి అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యమానికి భయపడుతోందని సీజేపీ నేతలు విమర్శించారు. ఏది ఏమైనప్పటికీ మోదీ సర్కార్ చేపట్టిన కఠిన చర్యలతో ఢిల్లీ ముట్టడి ప్లాన్ విఫలమైంది.