Voter List: దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్న ఓటర్ల జాబితా తొలగింపు వ్యవహారంపై భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితాలో పేర్లను తొలగించడానికి ఉపయోగించే ఫారమ్-7 దుర్వినియోగం కాకుండా కఠిన పరిమితులు విధించింది. ఇకపై ఒక బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ) రోజుకు గరిష్టంగా 10 ఫారమ్-7 దరఖాస్తులు మాత్రమే దాఖలు చేసేలా ఆదేశాలు జారీ చేసింది.
వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల పేర్లను టార్గెట్ చేసి తొలగించేందుకు ప్రీ-ప్రింటెడ్ ఫారమ్-7ల ద్వారా భారీగా దరఖాస్తులు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. కర్ణాటకలోని బళ్లారితో పాటు తెలంగాణలోని ముషీరాబాద్, బహదూర్‌పుర సహా పలు నియోజకవర్గాల్లో ఇష్టారీతిన ఫారమ్-7 దాఖలు చేశారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై ఈసీ స్పందించింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ 1960లోని రూల్ 13(2) ప్రకారం, ఒక నియోజకవర్గంలో పేరు తొలగించాలని దరఖాస్తు చేసే వ్యక్తి పేరు తప్పనిసరిగా అదే నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఉండాలని స్పష్టం చేసింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు
ప్రత్యేక సవరణ సమయంలో బీఎల్ఏలు డ్రాఫ్ట్ పబ్లికేషన్‌కు ముందు 50 దరఖాస్తులు, ఆ తర్వాత రోజుకు గరిష్టంగా 10 దరఖాస్తులు మాత్రమే సమర్పించేందుకు అనుమతి ఉంటుంది. సరైన ఆధారాలు లేకపోయినా, గడువు దాటిన తర్వాత వచ్చినా ఆ అప్లికేషన్లను ఈఆర్‌ఓలు తిరస్కరిస్తారు. రాజకీ కుట్రలతో తప్పుడు ఫారమ్-7 దరఖాస్తులు సమర్పించే వారిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు (ఈఆర్‌ఓలు) కేంద్ర ఎన్నికల సంఘం కఠిన ఆదేశాలు జారీ చేసింది.
