CJI Reply: కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో భేటీ కాకపోవడానికి గల కారణాలను బహిరంగపరిచేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరాకరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణను నిలిపివేయడం, ఓటు చోరీకి స్వస్తి పలకడం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, తిరిగీ బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకురావాలనే డిమాండ్లతో వినతిపత్రం సమర్పించేందుకు తమకు సమయం కేటాయించాలని కోరుతూ సిజెఐకి వారిద్దరూ లేఖ రాశారు.
ఈ విషయమై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కార్యక్రమం అనంతరం విలేకరులతో మాట్లాడిన సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. తనకు లేఖ అందిన మాట నిజమేనని, నిన్ననే దానికి రాతపూర్వక సమాధానం కూడా పంపినట్లు వెల్లడించారు. కొన్ని స్పష్టమైన, నిర్దిష్టమైన కారణాల వల్లే తాను ఖర్గే, రాహుల్‌లను కలవలేకపోతున్నానని ఆ లేఖలో స్పష్టం చేశానని తెలిపారు. అయితే ఆ కారణాలను మీడియాకు వివరించడానికి ఆయన నిరాకరిస్తూ, ఆ వివరాలను రాహుల్ గాంధీనే అడగాలని సూచించారు. “నేను మాత్రం ఆ లేఖ యొక్క గోప్యతను కాపాడాను” అని పేర్కొన్నారు.
ఎవరైనా కోర్టును ఆశ్రయించవచ్చు:
చట్టసభల ప్రతినిధులు లేదా ఎంపీలు తమ ఆందోళనలను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న ప్రశ్నకు సిజెఐ స్పందిస్తూ.. “సుప్రీంకోర్టు తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. సామాన్య పౌరుడైనా, ప్రజాప్రతినిధి అయినా ఎవరైనా పిటిషన్ ద్వారా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు” అని వ్యాఖ్యానించారు. చట్టానికి లోబడి బాధితుల సమస్యలను విచారించి తగిన న్యాయం అందిస్తామని తేల్చిచెప్పారు. ఢిల్లీలోని ప్రస్తుత రాజకీయ, భద్రతా పరిస్థితులపై వ్యాఖ్యానించడానికి సిజెఐ నిరాకరించారు. ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ సుప్రీంకోర్టు పర్యటన రద్దు కావటంపై స్పందిస్తూ, పరిపాలనా పరంగా చర్చించిన పిమ్మటే ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
