Hotel Hygiene: మహానగరంలో ఎంతో పేరుగాంచి, నిత్యం వందలాది మంది కస్టమర్లతో సందడిగా ఉండే ఒక ప్రముఖ హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యం బయటపడింది. బయటకు ఎంతో ఆర్భాటంగా, రంగురంగుల కాంతులతో ఆకట్టుకునే ఈ హోటల్ వెనుక ఉన్న అసలు రూపు చూస్తే భోజనప్రియుల గుండె గుబెల్లుమనడం ఖాయం. ‘పైన పటారం లోన లొటారం’ అన్న చందంగా కిచెన్ పరిసరాలు, ఆహార పదార్థాలు నిల్వ చేసే ప్రాంతాలు తీవ్ర అపరిశుభ్రతకు నిలయంగా మారాయి.
ఎలుకలు, పందికొక్కులు, వీధి కుక్కల సంచారం
‘మినిట్ 2 మినిట్’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ హోటల్ యాజమాన్యం చేస్తున్న నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఆహారం తయారుచేసే కిచెన్ ప్రాంగణంలో, చెత్త డబ్బాల వద్ద వీధి కుక్కలు, ఎలుకలు, పందికొక్కులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. తాగునీటి వాటర్ కూలర్లు, బేసిన్ల వద్ద తీవ్రమైన పాచి పట్టి, మురికి కూపంగా మారింది. హోటల్ వెనుక భాగంలో చెత్తాచెదారం, డ్రైనేజీ వ్యర్థాల నడుమ ఆహార పదార్థాలను తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో వ్యాపారులు చెలగాటమాడుతున్నారు. శుభ్రతను పూర్తిగా గాలికి వదిలేసిన యాజమాన్యం.. లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తోంది.
బాలకార్మికులతో వెట్టిచాకిరీ?
అంతేకాకుండా, చట్ట నిబంధనలను బొందపెడుతూ ఈ హోటల్లో మైనర్ పిల్లలతో పనులు చేయిస్తుండటం గమనార్హం. చిన్నపిల్లల చేత కఠినమైన పనులు చేయిస్తూ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ) అధికారులు గాఢనిద్రలో ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్న ఇటువంటి హోటళ్లపై తక్షణమే ఫుడ్ సేఫ్టీ, జీహెచ్ఎంసీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, సీజ్ చేయాలని భోజనప్రియులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
