శ్రీశైల మల్లన్న సేవలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి.. దసరా వేళ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు!

Srisailam Temple

Srisailam Temple

Srisailam Temple: దసరా నవరాత్రి మహోత్సవాలతో పవిత్ర శ్రీశైల దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఈ పావన పర్వదినాన శ్రీశైలం స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్వామివారి దర్శనార్థమై ఆలయానికి చేరుకున్నారు. రాజా గోపురం వద్దకు విచ్చేసిన ఎమ్మెల్యేకి దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో అధికారులు ఆయనను క్షేత్రంలోకి తీసుకెళ్లారు.

మల్లన్న, భ్రమరాంబికల దివ్య దర్శనం.. విశేష అర్చనలు

అనంతరం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి శ్రీ మల్లికార్జున స్వామివారికి, భ్రమరాంబ దేవికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శరన్నవరాత్రుల వేళ అమ్మవారి దివ్యరూపాన్ని సందర్శించి నమస్కరించుకున్నారు. లోకకళ్యాణాన్ని, నియోజకవర్గ ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తూ స్వామివారికి విశేష అర్చనలు జరిపించారు. దర్శనానంతరం ఆలయ వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఈవో, చైర్మన్ స్వామివారి లడ్డూ ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

భక్తుల సౌకర్యాలపై అధికారులకు సూచనలు

దర్శనానంతరం క్షేత్రంలో జరుగుతున్న దసరా నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై ఎమ్మెల్యే అధికారులతో సమీక్షించారు. పండగ రోజుల్లో దేశనలు మూలల నుంచి వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. మంచినీటి సదుపాయం, క్యూలైన్ల నిర్వహణ, ఉచిత ప్రసాద వితరణ, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. భక్తులకు కనీస సౌకర్యాల కల్పనలో ఎక్కడా లోటుపాట్లు రాకుండా సమిష్టిగా పనిచేయాలని అధికారులను కోరారు.

ఆధ్యాత్మిక నిలయంగా శ్రీశైలం అభివృద్ధి

శ్రీశైల క్షేత్ర మహత్యం, ఇక్కడ జరిగే దసరా ఉత్సవాల ప్రాశస్త్యం గురించి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రస్తావించారు. భక్తులందరిపై శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దివ్యానుగ్రహం ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవాల వేళ క్షేత్ర పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, భద్రతా చర్యలు పటిష్టంగా ఉండేలా పోలీస్, దేవాదాయ శాఖల సమన్వయం ఉండాలని పేర్కొన్నారు.