భారత్ – వెస్టిండీస్ టీ20 సమరం.. ఉప్పల్‌లో పటిష్ట బందోబస్తు.. పోలీసుల కీలక సూచనలు ఇవే!

Uppal T20

Uppal T20

Uppal T20: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రేపు రాత్రి 7 గంటలకు జరగనున్న భారత్ – వెస్టిండీస్ 4వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ జి. సుమతి వెల్లడించారు. మ్యాచ్ సందర్శకులు, అంతర్జాతీయ ఆటగాళ్లు, ముఖ్యంగా మహిళలు, పిల్లల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు సిద్ధం చేశామని తెలిపారు.

మొత్తం 2,200 మందికి పైగా పోలీస్ సిబ్బందితో విస్తృత భద్రతా చర్యలు చేపట్టినట్లు సీపీ తెలిపారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ నియంత్రణ, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT), షీ టీమ్స్, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS)లతో పాటు పలు ప్రత్యేక విభాగాలు పూర్తి సమన్వయంతో విధుల్లో ఉంటాయని స్పష్టం చేశారు. స్టేడియం లోపల, వెలుపల అను అను అనుమానాస్పద కదలికలపై కన్ను వేసి ఉంచేందుకు 408 సీసీటీవీ కెమెరాలను అనుసంధానించామని, డ్రోన్ల ద్వారా నిరంతరం నిఘా కొనసాగుతుందని వివరించారు.

ప్రేక్షకులకు సీపీ విజ్ఞప్తి

మ్యాచ్ చూడటానికి వచ్చే వేలాది మంది అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ వసతులను క్రమబద్ధీకరించినట్లు సీపీ తెలిపారు. “మీ భద్రత మా బాధ్యత – మీ సహకారం మా బలం” అని పేర్కొంటూ, స్టేడియానికి వచ్చే ప్రేక్షకులు పోలీసుల సూచనలను పాటించి, సజావుగా మ్యాచ్ నిర్వహణకు సహకరించాలని సుమతి కోరారు. ఆకతాయిలు లేదా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.