ACB Bribe: రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నప్పటికీ, కొందరు అధికారుల లంచాల దందాకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో రూ. 20 లక్షల భారీ లంచం తీసుకుంటూ మండల సర్వేయర్ శ్రీనివాసులు, తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.
అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో హెచ్ఎమ్‌డీఏ పరిధిలోని ఓ లేఅవుట్ జాయింట్ ఇన్స్‌పెక్షన్ సర్వే రిపోర్టుకు సంబంధించి అధికారులు ఇద్దరూ బాధితుడి నుంచి దాదాపు రూ. 30 లక్షల లంచం డిమాండ్ చేశారు. చివరకు రూ. 20 లక్షలకు డీల్ కుదిరింది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించారు.
బాధితుడి నుంచి సర్వేయర్ శ్రీనివాసులుతో పాటు తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి లంచం సొమ్ము తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న ఏసీబీ బృందాలు, వారి ఇళ్లతో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. అక్రమాస్తులకు సంబంధించిన కీలక పత్రాలు, నగదు స్వాధీనం చేసుకునేందుకు తనిఖీలు కొనసాగిస్తున్నారు. లంచగొండి అధికారుల అరెస్ట్‌తో అక్రమార్కుల గుండెల్లో గుబులు పట్టుకుంది..
