NSUI Vandalism: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో సామాజిక చైతన్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను ప్రశ్నిస్తోంది. మన్సూరాబాద్లోని ఒక ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులపై యాజమాన్యం ప్రవర్తించిన తీరు ఎంత సముచితం కాదో.. దానికి కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ (NSUI) బదులిచ్చిన తీరు అంతే ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని నిరసించడం హక్కు కావచ్చు, కానీ విద్యాసంస్థల్లో ఫర్నిచర్ ధ్వంసం చేస్తూ, దాడులు, అరాచకాలతో ప్రతీకారం తీర్చుకోవడం సరైన విధానమేనా? అనేది నేడు చర్చేనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ అంటేనే మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, శాంతియుత పోరాట మూల సూత్రాల ప్రాతిపదికన నడిచే ఒక జాతీయ పార్టీ. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమాజంలో ప్రేమ, శాంతిని పెంపొందించేందుకు ‘మొహబ్బత్ కీ దుకాణ్’ అనే భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారు. అయితే, అదే పార్టీకి అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘ నాయకులు విద్యాసంస్థల్లో వీధి రౌడీలను తలపించేలా భౌతిక దాడులు, విధ్వంసాలకు దిగడం వారి సిద్ధాంతాలకు, ఆచరణకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఎత్తిచూపుతోంది.
విప్లవ యోధుడు భగత్ సింగ్ సైతం బ్రిటిష్ పాలకుల దౌర్జన్యాలపై పోరాడినప్పుడు తన ఆశయాల కోసం, భావజాల వ్యాప్తి కోసమే గళాన్ని వినిపించారు తప్ప, ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తూ, దేశాన్ని హింస వైపు నెట్టాలని ఎన్నడూ భావించలేదు. అన్యాయం జరిగినప్పుడు న్యాయపరంగా, శాంతియుతంగా పోరాడటం ప్రజాస్వామ్యం నేర్పిన మార్గం. కానీ, నిరసనల పేరుతో హింసను ప్రోత్సహించడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సమాజానికి చేటు చేస్తుంది. యువతరం ప్రతీకారం కంటే ప్రజ్ఞను, విచక్షణను ఆయుధంగా మార్చుకున్నప్పుడే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుంది.
