Keesara ACB: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. రూ. 2.50 లక్షల భారీ లంచం తీసుకుంటూ కీసర డిప్యూటీ తహశీల్దార్ (డీటీ) సందీప్ రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఒక అధికారిక పని నిమిత్తం బాధితుడి నుంచి డీటీ సందీప్ రెడ్డి రూ. 2.50 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో పక్కా పథకం ప్రకారం వ్యూహరచన చేసిన ఏసీబీ అధికారులు.. బాధితుడి నుంచి డీటీ సందీప్ రెడ్డి నగదు తీసుకుంటుండగా మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ముమ్మరంగా తనిఖీలు
ప్రస్తుతం కీసర తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు, సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో భాగంగా ఇప్పటికే పలు కీలక పత్రాలు, దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయానికి చెందిన ఇతర సిబ్బందిని కూడా అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. లంచగొండి అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.
