సివిల్ సర్వీసెస్‌కు గుడ్‌బై!
ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ సంచలనం
13 ఏళ్ల సర్వీస్‌కు స్వచ్ఛంద విరమణ
భర్త బాటలోనే నడిచిన యూపీ కేడర్ అధికారిణి
మినిట్ 2 మినిట్, లక్నో (ఆగస్ట్ 31): ఐఏఎస్ అధికారిణిగా కీలక బాధ్యతలు నిర్వహించిన దివ్య మిట్టల్ ఒక్కసారిగా తన పదవికి రాజీనామా ప్రకటించి సంచలనం సృష్టించారు. 13 ఏళ్ల సుదీర్ఘ సర్వీసుకు స్వచ్ఛందంగా గుడ్‌బై చెప్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. హోదా ముగిసినా దేశం కోసం తాను కన్న కలలు మాత్రం ఎప్పటికీ కొనసాగుతాయని ఆమె భావోద్వేగంతో పేర్కొన్నారు.
ఢిల్లీకి చెందిన దివ్య మిట్టల్ 2013 బ్యాచ్ యూపీ కేడర్ అధికారిణి. ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులో ఉన్నత విద్య అభ్యసించిన ఆమె, లండన్‌లో లభించిన అత్యంత భారీ ఆఫర్ ఉద్యోగాన్ని సైతం వదిలి దేశ సేవ కోసం భారత్‌కు తిరిగి వచ్చి సివిల్ సర్వీసెస్ ఎంచుకున్నారు. తన సర్వీసు కాలంలో రైతులు, గ్రామీణ కుటుంబాలు, దివ్యాంగుల కోసం అందించిన సేవలను ఆమె స్మరించుకున్నారు. మిర్జాపూర్‌లోని లహూరియా దేహ్ గ్రామానికి తొలిసారిగా పైపుల ద్వారా తాగునీరు అందించిన ఘట్టం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైనదని తెలిపారు. అలాగే గ్రామీణ విద్యార్థుల చదువు కోసం ఉచిత మొబైల్ యాప్‌ను సైతం స్వయంగా రూపొందించారు.
గత మే నెలలో దేఓరియా ప్రాంతం వైపు లక్నో రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయిన ఆమె, తాజాగా రాజీనామా నిర్ణయం తీసుకోవడం అడ్మినిస్ట్రేటివ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె భర్త గగన్ దీప్ సింగ్ కూడా గతంలో ఐఏఎస్ అధికారిగానే సేవలందించారు. ఆయన 2022లోనే తన ఉద్యోగానికి రాజీనామా అందించగా, ఇప్పుడు దివ్య మిట్టల్ సైతం భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ రాజీనామా నిర్ణయం తీసుకోవడం సోషల్ మీడియాలో విశేషంగా మారింది.
