కోట్లు వసూలు చేశారు.. కన్నీళ్లు మిగిల్చారు!
వాసవి గ్రూపునకు కొనుగోలుదారుల కన్నీటి వేదన పట్టదా?
ఎల్.బి. నగర్ ఆనంద నిలయం ఫేజ్-3లో వందలాది బాధితులు
నెలలు గడుస్తున్న పూర్తికాని నిర్మాణాలు
సినీ తారలతో అట్టహాసంగా ప్రారంభం.. మూడేళ్లుగా సాగదీస్తున్న యాజమాన్యం
హామీలు నీటిమూటలయ్యాయని వాపోతున్న కొనుగోలుదారులు
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యునిటీ అంటూ గొప్పలు
పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా వాసవి ఆనంద నిలయం తీరు
మినిట్ 2 మినిట్: “దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ.. 29.3 ఎకరాల్లో 11 టవర్లు, 3,576 ఫ్లాట్లు.. సకల సౌకర్యాలు!” అంటూ మూడేళ్ల క్రితం లింగోజిగూడ ఎల్.బి. నగర్ మెట్రో స్టేషన్ వద్ద వాసవి గ్రూప్ ఆర్భాటంగా ప్రచారం ప్రారంభించింది. నాటి ప్రారంభోత్సవంలో సినీ నటులు సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, శ్రీలీల, శ్రీముఖిల సందడితో పాటు ప్రజాప్రతినిధులు, వాసవి సంస్థ చైర్మన్ ఎర్రం విజయ్ కుమార్ హాజరై లోగో, బ్రోచర్లను ఆవిష్కరించారు. పేపర్లు, టీవీలు, మెట్రో స్టేషన్లలో కోట్లు కుమ్మరించి ప్రచారం చేశారు. తీరా సమయం వచ్చేసరికి పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా మారింది. ఆనంద నిలయం కాస్తా కొనుగోలుదారుల పాలిట ఆవేదనల ఆలయం అయ్యింది.
ప్రధానంగా ఫేజ్-3కి సంబంధించి 300 మందికి పైగా కొనుగోలుదారులు తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నారు. ఎల్.బి. నగర్ లాంటి సూపర్ గ్రోత్ ఏరియాలో సొంతింటి కల నెరవేరుతుందని, తమ తర్వాతి తరం ప్రశాంతంగా ఉంటుందని భావించిన సీనియర్ సిటిజన్లు తమ కష్టార్జితాన్ని, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ఈ ప్రాజెక్టులో పెట్టారు. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు ముందుకు సాగకపోవడంతో బిల్డర్ల చుట్టూ తిరగలేక అనారోగ్యం పాలవుతున్నారు. ఎప్పుడు అడిగినా ఇదిగో.. అదిగో అంటూ కాలక్షేపం కబుర్లు చెప్పడం తప్ప, గ్రౌండ్ లెవెల్‌లో పని పురోగతి కనిపించడం లేదు. ఎర్రం విజయ్ కుమార్ ఇచ్చిన హామీలు కూడా నీటిమూటలుగానే మిగిలిపోయాయి.
ఈ అన్యాయంపై బాధితులు ఇప్పటికే న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఒప్పందాలు, బ్యాంక్ చెల్లింపుల రికార్డులను అధికారుల ముందుంచేందుకు ఆధారాలు సిద్ధం చేసుకున్నారు. తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఇళ్లను సమయానికి పొందడం తమ హక్కు అని స్పష్టం చేస్తున్నారు.
కొనుగోలుదారుల ప్రధాన డిమాండ్లు:
ఫేజ్-3 నిర్మాణ పనులను వెంటనే పూర్తి స్థాయిలో పునఃప్రారంభించాలి.
నిర్మాణ గడువును, ఫ్లాట్ల హ్యాండోవర్ తేదీని లిఖితపూర్వకంగా ప్రకటించాలి.
ప్రతి 15 రోజులకు పనుల పురోగతి నివేదికను కొనుగోలుదారులకు అందించాలి.
కొనుగోలుదారుల ప్రతినిధులు క్రమం తప్పకుండా సైట్‌ను సందర్శించే అవకాశం ఇవ్వాలి.
నిధుల వినియోగం, నిర్మాణ వివరాల్లో పూర్తి పారదర్శకత పాటించాలి.
అధికారుల అనుమతులతో శాంతియుత మారథాన్, వాక్‌థాన్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న కొనుగోలుదారులు, తమ నిరసనను తెలియజేసేందుకు నేడు భారీ నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి నిష్పక్షపాత విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
