రక్షక భటులకే తప్పని ఇక్కట్లు.. అధికారుల నిర్లక్ష్యానికి రోడ్డెక్కిన ప్రయాణికులు!

LB Nagar

LB Nagar

LB Nagar:  నగరం నడిబొడ్డున ఉన్న ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంతలు వాహనదారులకు తీవ్ర ఆటంకంగా మారాయి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ అత్యంత రద్దీ ప్రాంతంలో గుంతలు ఏర్పడటంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నిర్లక్ష్యపు దృశ్యం ‘మినిట్ 2 మినిట్’ కెమెరా కంటపడింది.

రహదారిపై ఏర్పడిన లోతైన గుంతల్లో ఆర్టీసీ బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సి రావడంతో వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి. వర్షపు నీరు గుంతల్లో చేరడంతో గుంత లోతు తెలియక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆఫీసులకు, అత్యవసర పనులకు వెళ్లేవారు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారని ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతంలోనే రహదారి ఈ దుస్థితిలో ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు పర్యవేక్షించకపోవడం పట్ల స్థానికులు, వాహనదారులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి రహదారిపై గుంతలను పూడ్చి, గతుకుల రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం కలిగించాలని ప్రజలు కోరుతున్నారు.