అధికారుల నిర్లక్ష్యం.. వేసిన మూడంటే మూడు రోజుల్లోనే పగిలిన డ్రైనేజీ మ్యాన్ హోల్!

GHMC Negligence

GHMC Negligence

GHMC Negligence: జీహెచ్‌ఎంసీ రోడ్లు, డ్రైనేజీ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఎంత లొసుగులతో సాగుతున్నాయో చెప్పడానికి ఈ దృశ్యమే నిదర్శనం. కామినేని హాస్పిటల్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై నిర్మించిన మ్యాన్ హోల్ మూత వేసిన మూడు రోజులకే పూర్తిగా పగిలిపోయి ప్రమాదకరంగా మారింది. ఈ నిర్లక్ష్యపు తీరు ‘మినిట్ 2 మినిట్’ కెమెరా కంటపడింది.

తీవ్రమైన రద్దీ ఉండే కామినేని ఆసుపత్రి మార్గంలో నిత్యం వేలాది వాహనాలు, రోగులు, కాలినడక ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అధికారులు మ్యాన్ హోల్ మూతను కొత్తగా నిర్మించినప్పటికీ, సరైన సిమెంట్, ఇనుప తీగల నాణ్యత పాటించకపోవడం వల్లే స్వల్ప వ్యవధిలోనే కాంక్రీట్ ఊడిపోయి లోపలి ఇనుప గ్రిల్ బయటపడింది. వాహనాలు లేదా పాదచారులు పొరపాటున దీనిపై అడుగు వేస్తే తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశముంది.

ప్రజాధనాన్ని వెచ్చించి చేపడుతున్న పనుల్లో కాంట్రాక్టర్లు, పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల స్థానికులు, వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. సంబంధిత పురపాలక అధికారులు తక్షణమే స్పందించి, నాణ్యమైన మూతను ఏర్పాటు చేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.