Police Martyrs: పోలీసు అమరవీరుల సంస్మరణ దినమైన అక్టోబర్ 21 అత్యంత భావోద్వేగమైన రోజని, ప్రజల భద్రత కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని అమరవీరుల స్మృతి స్థూపం వద్ద నివాళులర్పించారు.
అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, ఈ ఏడాది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు – మహిళల భద్రతపై పోలీస్ శాఖకు సీఎం దిశానిర్దేశం:
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, వారి పిల్లల భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ను ప్రారంభించామని తెలిపారు. ఎక్స్‌గ్రేషియా పెంపు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఉచిత విద్య, వైద్య సదుపాయాలు అందిస్తున్నట్లు గుర్తుచేశారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో పోలీసులు మరింత సున్నితంగా వ్యవహరించి బాధితులకు తక్షణ న్యాయం చేయాలని ఆదేశించారు.
పోలీస్‌స్టేషన్‌కు వచ్చేవారిని కుటుంబ సభ్యుల్లా చూస్తేనే వంద శాతం న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్, ఆహార కల్తీ వంటి కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖను మరింత బలోపేతం చేస్తున్నామని, శాంతియుత తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతామని సీఎం స్పష్టం చేశారు.
