Pittampalli Pollution: నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పిట్టంపల్లి గ్రామం వైపు వెళ్తే చాలు… ఎవరి గుండెయినా తరుక్కుపోవాల్సిందే! కొన్నేళ్ల క్రితం వరకు ఈ గ్రామం ఎలా ఉండేది? ఇక్కడి రైతుల జీవితాలు ఎంత ప్రశాంతంగా సాగిపోయేవి? ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అదొక పచ్చని స్వప్నంలా కనిపిస్తుంది. చుట్టూ పచ్చని పంట పొలాలు, పొంగిపొర్లే భూగర్భజలాలు, ఊరిని తాకుతూ వెళ్లే చల్లటి గాలులు, పశుపక్ష్యాదుల కిలకిలరావాలతో ఆ ప్రాంతం నిత్య వసంతంలా కళకళలాడేది. నమ్ముకున్న భూమిని నలుదిక్కులా సాగు చేసుకుంటూ, కష్టపడి బతుకుబండిని లాగుతున్న ఆ రైతన్నల ముఖాల్లో చిరునవ్వులు చెరగనివి.
ఆ నేలతల్లి నవ్వుతూ పండించిన పంటలతో ఆ పల్లె ఒక అన్నపూర్ణలా వెలుగొందింది. కానీ, కాలం మారింది. ఆ గ్రామం తలరాతను మార్చేయడానికి అన్నట్లుగా చుట్టుపక్కల వెలసిన 20కి పైగా కెమికల్ కంపెనీలు ఆ పల్లె పాలిట యమపాశాలుగా మారాయి. పరిశ్రమల నుంచి వెలువడిన విపరీతమైన రసాయన వ్యర్థాలు, విషపూరిత పొగ ఆ ప్రాంతాన్ని పూర్తిగా కమ్మేశాయి. ఒకనాడు జీవనాధారంగా ఉన్న ప్రకృతి కాస్తా.. నేడు పగబట్టిన వాతావరణంగా మారిపోయింది. నీరు, గాలి, నేల.. సమస్తం కాలుష్య కోరల్లో చిక్కుకుని జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది.
ఈ కాలుష్య భూతం ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే, తాగే గుక్కెడు మంచినీళ్ల నుంచి పీల్చే గాలి వరకు ప్రతి అణువు విషపూరితమైపోయింది. భూగర్భ జలాలు అడుగంటిపోయి, ఉన్న కొద్దిపాటి నీరు కూడా రసాయనాలతో నిండిపోయింది. ఫలితంగా ఎన్నో ఎకరాల సస్యశ్యామల భూములు నేడు బీడువారాయి. చెట్టూ పుట్టా ఎండిపోయి, మూగజీవాలు సైతం అల్లాడిపోతున్నాయి. పచ్చని ప్రకృతితో పరవశించేలా ఉన్న ఆ నేలపై ఇప్పడు మనుషులు బతకడమే ఒక ఘోరమైన శాపంగా మారింది. గ్రామంలో ఎటు చూసినా గాలిలో ఘాటైన రసాయనాల వాసనలు, కళ్లు బైర్లు కమ్మే పొగమంచు లాంటి విషవాయువులు రాజ్యమేలుతున్నాయి. ఇక్కడి దయనీయ పరిస్థితిని చూసి తట్టుకోలేక బతుకు జీవుడా అంటూ పట్నాలకు వలస బాట పడుతున్నారు జనాలు. కనీసం తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక, తమను కాపాడే నాథుడే లేక ఆ గ్రామ ప్రజలు పడుతున్న వేదన వర్ణనాతీతం.
ప్రకృతిని నమ్ముకుని బతికిన ఆ పల్లె నేడు కాలుష్య కాసారంగా ఎలా మారింది? అక్కడ రోజురోజుకూ దిగజారిపోతున్న పరిస్థితుల వెనుక అసలు నిజాలేంటి? రాబోయే భాగంలో అసలు రోగాల బారిన పడుతున్న ఆ ప్రజల దయనీయ గాథలను వివరంగా చూద్దాం.
