ప్రాణాలతో చెలగాటం.. పాత స్వీట్ల రీసైక్లింగ్ గుట్టు రట్టు చేసిన ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్!

Food Safety

Food Safety

Food Safety:  రాబోయే దీపావళి పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విస్తృత తనిఖీలు చేపట్టింది. మొత్తం 12 ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలుగా ఏర్పడిన అధికారులు నగరంలోని ప్రముఖ స్వీట్ షాపులు, తయారీ కేంద్రాలపై ఆకస్మికంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రముఖ వ్యాపార సంస్థలు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న దారుణాలు వెలుగులోకి వచ్చాయి.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతులు లేకపోవడం, గడువు ముగిసిన లైసెన్స్‌లతో వ్యాపారాలు నడపడం, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో మిఠాయిలు తయారు చేయడం వంటి తీవ్ర లోపాలను అధికారులు గుర్తించారు. గడువు దాటిన పాత స్వీట్లను కౌంటర్లలో ప్రదర్శించడమే కాకుండా, కొత్త స్వీట్ల తయారీలో పాత మిఠాయిలను రీసైక్లింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు తేలింది. మరికొన్ని చోట్ల ఫంగస్ పట్టిన వేరుశనగలు, పురుగులు పట్టిన పిండి పదార్థాలతో పిండి వంటలు తయారు చేస్తుండటం గమనార్హం. నిబంధనలు తక్కిన 17 ప్రముఖ దుకాణాలపై చట్టపరమైన చర్యలు ప్రారంభించి, నిర్వాహకులకు షోకాజ్, ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు.

మరోవైపు మేడ్చల్ జిల్లా పరిధిలోని అతెల్లి ప్రాంతంలో ఏ-1 జింజర్ గార్లిక్ పేస్ట్ తయారీ యూనిట్‌పై ప్రత్యేక ఎస్‌ఓటీ, మేడ్చల్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉమ్మడిగా దాడి చేశారు. కనిష్ట నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో కుళ్లిపోయిన పదార్థాలతో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. అక్కడ లభించిన 20 కేజీల బరువు గల 22 బస్తాల్లో ఉన్న సుమారు 440 కిలోల బూజు పట్టిన కుళ్లిపోయిన వెల్లుల్లి, 50 కిలోల పాడైపోయిన అల్లాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని తక్షణమే ధ్వంసం చేశారు. అనుమానాస్పదంగా ఉన్న నమూనాలను ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన అధికారులు.. ప్రజారోగ్యానికి హాని కలిగిస్తే కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేసి షాపులను సీజ్ చేస్తామని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ హెచ్చరించారు.