“థాంక్యూ బీజేపీ..” తమ ర్యాలీ ఉచిత ప్రచారంపై రాహుల్ గాంధీ పంచ్‌లు!

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi:  రాజధాని ఢిల్లీలో నవంబర్ 1వ తేదీన నిర్వహించ తలపెట్టిన ‘ఇండి’ కూటమి ప్రతిష్ఠాత్మక ర్యాలీపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అధికార బీజేపీని లక్ష్యంగా చేసుకుని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆయన తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ కూటమి తలపెట్టిన ర్యాలీకి బీజేపీయే ఉచితంగా విస్తృత ప్రచారం కల్పిస్తోందంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కమలం పార్టీకి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ చురకలంటించారు.

ర్యాలీకి సంబంధించిన సమాచారం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ చేరేలా బీజేపీ, దాని మిత్రపక్షాలే ఉచిత పబ్లిసిటీ కల్పిస్తున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అందుకు వారికి నా కృతజ్ఞతలు అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో అన్యాయంగా ఓట్లను తొలగిస్తున్నారని, రాజ్యాంగ నిబంధనలను బహాటంగా ఉల్లంఘిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగించే ఇటువంటి అక్రమ విధానాలను ఇకపై ఎంతమాత్రం మౌనంగా సహించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. దేశ భవిష్యత్తుపై, రాజ్యాంగ సూత్రాలపై నమ్మకం ఉన్న విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, యువతతో పాటు వ్యాపార వర్గాలు నవంబర్ 1న జరగబోయే ఈ నిరసన ప్రదర్శనలో స్వచ్ఛందంగా తరలివచ్చి విజవంతం చేయాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.