స్కూల్‌ కాంపౌండ్‌లోనే ఘాతుకం.. విద్యాసంస్థల్లో పిల్లలకు రక్షణ ఏదీ? ప్రశ్నిస్తున్న రాప్తాడు ఘటన!

Raptadu Attack

Raptadu Attack

Raptadu Attack:  అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్‌లో ఉన్మాదం పడగవిప్పింది. ప్రేమించలేదనే కక్షతో ఒక యువకుడు పాఠశాల ఆవరణలోకి చొరబడి పదో తరగతి చదువుతున్న బాలికపై రక్తమోడేలా దారుణంగా దాడి చేశాడు. భద్రత ఉండాల్సిన విద్యాకుసుమాల నిలయంలోనే ఈ తరహా ఘాతుకం జరగడం బడులలోని పిల్లల రక్షణపై తీవ్ర ఆందోళనలను కలిగిస్తున్నాయి.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్న ఆ బాలికను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. క్షణ క్షణం పరిస్థితిని సమీక్షిస్తూ కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి గ్రీన్ ఛానెల్ ద్వారా అంబులెన్స్‌ను అత్యంత వేగంగా బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. మంత్రి లోకేష్ స్వయంగా అక్కడ వైద్య బృందంతో మాట్లాడి చిన్నారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ఆదివారం ఆయన నేరుగా ఆసుపత్రికి వెళ్ళి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పనున్నారు.

సమాజాన్ని ప్రశ్నిస్తున్న వరుస ఘటనలు

ఈ ఘటన కేవలం ఒక నేరం మాత్రమే కాదు, పిచ్చి ప్రేమ పేరిట యువతలో పెరుగుతున్న హింసాత్మక పోకడలకు పరాకాష్ట. పాఠశాల కాంపౌండ్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు యథేచ్ఛగా వచ్చి దాడి చేసే పరిస్థితి ఉందంటే విద్యాసంస్థల భద్రత ఎంత వీక్‌గా ఉందో స్పష్టమవుతోంది. నైతిక విలువలు కరువై, నిరాకరణను తట్టుకోలేక కక్ష పెంచుకునే ఈ విధ్వంసకర సంస్కృతికి అడ్డుకట్ట వేయకపోతే మన పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లేనని సామాజిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.